కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దహరివాణం గ్రామంలో రాజకీయ నాయకుల రాకపై స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పెద్దహరివాణాన్ని మండల కేంద్రంగా ప్రకటించేంతవరకు ఏ రాజకీయ పార్టీ నాయకుడినీ గ్రామంలోకి రానిచ్చేది లేదంటూ గ్రామస్తులు రోడ్డెక్కారు.

గ్రామంలోని ఓ బంధువు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వచ్చిన టీడీపీ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, టిడిపి మాజీ గ్రంథాలయ డైరెక్టర్ గోపాల్ రెడ్డిల వాహనాలను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఊరి పొలిమేరల్లోనే వాహనాల ముందు నిలబడి నిరసన తెలపడంతో రోడ్డుపై కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మండల సాధన కోసం రాజకీయ నాయకులను గ్రామంలోకి రానివ్వబోమని ఇప్పటికే బోర్డు ఏర్పాటు చేసిన విషయాన్ని గ్రామస్తులు గుర్తుచేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులను నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు పోలీసులు ఇరువర్గాలకు సర్దిచెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

గెజిట్ రద్దే ఆందోళనకు కారణం: గతంలో పెద్దహరివాణాన్ని నూతన మండల కేంద్రంగా ప్రకటిస్తూ ప్రభుత్వం ప్రాథమిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే, చుట్టుపక్కల ఉన్న దాదాపు 16 గ్రామాల ప్రజలు పెద్దహరివాణం మండల కేంద్రంగా తమకు ఆమోదయోగ్యం కాదంటూ తీవ్రస్థాయిలో ధర్నాలు, నిరసనలు చేపట్టారు. దీంతో ప్రభుత్వం ఆ గెజిట్ ప్రక్రియను తాత్కాలికంగా రద్దు చేసింది. అప్పటి నుంచి పెద్దహరివాణం ప్రజలు మండల హోదా కోసం తమ ఆందోళనలను కొనసాగిస్తూ, గ్రామ ప్రవేశంపై రాజకీయ నేతలకు ఆంక్షలు విధించారు.
