కర్నూలు జిల్లా ఆదోని న్యాయస్థానం ప్రాంగణంలోనే ఓ సీనియర్ న్యాయవాదిపై ప్రత్యర్థి వర్గం దాడికి తెగబడిన ఘటన బుధవారం ఆదోనిలో తీవ్ర కలకలం రేపింది. తోటి న్యాయవాదులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల మేరకు..

ఆదోని బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది, టీడీపీ లీగల్ సెల్ ప్రెసిడెంట్ వై.ఆర్. మల్లికార్జునపై బుధవారం సాయంత్రం కోర్టు ఆవరణలోనే ప్రత్యర్థి వర్గానికి చెందిన ఓ వ్యక్తి దాడికి యత్నించాడు. ఓ కేసుకు సంబంధించిన ఫైల్‌ను తక్షణమే తనకు ఇవ్వాలంటూ సదరు వ్యక్తి మల్లికార్జునను డిమాండ్ చేశాడు. సదరు ఫైల్‌ను నేరుగా కోర్టులోనే సమర్పిస్తానని, అభ్యంతరాలు ఏవైనా ఉంటే న్యాయస్థానం ఎదుటే తేల్చుకుందామని న్యాయవాది స్పష్టం చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తి, కోర్టు ఆవరణలోనే అందరూ చూస్తుండగానే ఆయనపై భౌతిక దాడికి దిగాడు.

కోర్టు ప్రాంగణంలోనే విధి నిర్వహణలో ఉన్న సీనియర్ న్యాయవాదిపై దాడి జరగడంతో న్యాయవాద వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. తోటి న్యాయవాదులంతా ఏకమై స్థానిక టూటౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. ప్రధాన రహదారిపై బైఠాయించి నిందితుడిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, న్యాయవాదులకు తగిన రక్షణ కల్పించాలని నినాదాలు చేశారు.

రహదారిపై ధర్నాతో ట్రాఫిక్ స్తంభించి, పోలీస్ స్టేషన్ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.