కర్నూలు జిల్లా ఆదోని సబ్-డివిజన్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ASP)గా యువ ఐపీఎస్ అధికారిణి జయ శర్మ బాధ్యతలు స్వీకరించారు. స్థానిక పరిస్థితులను అధ్యయనం చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు విలేకరుల సమావేశంలో తన కార్యాచరణను వివరించారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, మహిళల రక్షణే తన ప్రథమ ప్రాధాన్యాలని ఏఎస్పీ జయ శర్మ స్పష్టం చేశారు. నేరస్థుల్లో చట్టమంటే భయం ఉండాలని, అదే సమయంలో సామాన్య ప్రజలకు పోలీసు వ్యవస్థపై సంపూర్ణ నమ్మకం కలగాలని ఆమె పేర్కొన్నారు. బాధితులు ఎటువంటి సంకోచం లేకుండా పోలీస్ స్టేషన్లకు వచ్చి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా భద్రత కోసం ప్రవేశపెట్టిన ‘శక్తి యాప్’ వినియోగాన్ని విస్తృతంగా పెంచుతామని ఆమె తెలిపారు. ఎమర్జెన్సీ కాల్స్, ట్రాక్ మై ట్రావెల్, ఫోన్ షేక్ అలర్ట్ వంటి ఫీచర్లతో రూపొందిన ఈ యాప్‌పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తామన్నారు. భద్రతా కారణాలతో మహిళల చదువు, అవకాశాలు ఆగకూడదన్నదే తన ఆకాంక్ష అని ఆమె స్పష్టం చేశారు. ఆదోనిలో క్రికెట్ బెట్టింగ్‌లు, ఇతర అక్రమ కార్యకలాపాలపై క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా ఎస్పీ మార్గదర్శకత్వంలో, కర్నూలు పోలీస్ హెడ్‌క్వార్టర్స్ ఆదేశాలకు అనుగుణంగా శాంతియుత వాతావరణం నెలకొల్పుతామని పేర్కొన్నారు.

ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ గణితం, ఐఐటీ ఢిల్లీ నుంచి ఎమ్మెస్సీ మ్యాథమెటిక్స్ పూర్తి చేసిన జయ శర్మ, సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల మానసిక దృఢత్వం కోసం “ప్రాక్టికల్ మెంటల్ స్ట్రాటజీస్ టు విన్ యూపీఎస్సీ బ్యాటిల్” అనే పుస్తకాన్ని కూడా రచించారు. ఆమె తండ్రి ప్రమోద్ శర్మ హర్యానాలో ఫుడ్ సప్లై కంట్రోలర్‌గా పనిచేస్తుండగా, తల్లి నీతూ శర్మ గృహిణి. ప్రజాసేవలో మీడియా, ప్రజలు పోలీసు శాఖకు పూర్తి సహకారం అందించాలని ఆమె కోరారు.