నాడు మండల సాధన పేరిట ఉద్యమం.. నేడు ఎన్నికల బరిలో నాయకులు

రాజకీయ నాయకులకు ‘ప్రవేశం లేదు’ బోర్డుకు ప్రింట్ తో మూసేసిన గ్రామస్తులు.. నాడు మండల సాధన పేరిట ఉద్యమం.. నేడు ఎన్నికల బరిలో నాయకులు పెద్దహరివనం మండల సాధన కమిటీ తీరుపై గ్రామస్తుల ఆగ్రహం.. గతంలో రాజకీయ నాయకులు గ్రామంలోకి రావద్దంటూ పెట్టిన హెచ్చరిక బోర్డుకు గ్రామస్తులే స్వయంగా తెలుపు రంగు పూసి తమ నిరసనను వ్యక్తం చేశారు.

గ్రామం పొలిమేరల్లో “రాజకీయ నాయకులకు ప్రవేశం లేదు” అంటూ బోర్డులు ఏర్పాటు చేసిన ఫోటో
పూర్తి వీడియో చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దహరివనం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకున్న ఈ పరిణామం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. పెద్దహరివనం గ్రామాన్ని ప్రత్యేక మండలంగా ప్రకటిస్తూ గతంలో విడుదలైన గెజిట్‌ను రద్దు చేయడంతో గ్రామస్తుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది.

గ్రామం పొలిమేరల్లో “రాజకీయ నాయకులకు ప్రవేశం లేదు” బోర్డులు పేంట్ వేస్తున్న ఫోటో

గ్రామాన్ని మండలంగా ప్రకటించేంతవరకు రాజకీయ నాయకులెవరూ గ్రామంలోకి అడుగుపెట్టరాదని గ్రామస్తులు, సాధన కమిటీ సభ్యులు ముక్తకంఠంతో తీర్మానించారు. గ్రామం పొలిమేరల్లో “రాజకీయ నాయకులకు ప్రవేశం లేదు” అంటూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, బోర్డులు ఏర్పాటు చేశారు. అప్పటి నుండి గ్రామంలోకి వచ్చే రాజకీయ నాయకులను గ్రామ కమిటీ సభ్యులు తీవ్రంగా అడ్డుకుంటూ వచ్చారు.

పాత ఫైల్ ఫోటో

మండలం సాధించేవరకు స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు నాడు ఉద్యమ కమిటీ పిలుపునిచ్చింది. అయితే, ప్రస్తుత స్థానిక ఎన్నికలు సమీపించడంతో పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. నాడు ఎన్నికలు బహిష్కరిస్తామన్న కమిటీ సభ్యులే.. నేడు తామే స్వయంగా రాజకీయ నాయకులుగా మారి ఎన్నికల బరిలో నిలవడానికి సిద్ధమయ్యారు.

పాత ఫైల్ ఫోటో

మండల సాధన పేరుతో తమ భావోద్వేగాలతో ఆడుకొని, ఇప్పుడు స్వార్థ రాజకీయాల కోసం ఎన్నికల్లో పోటీ చేస్తుండటంపై గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పెద్దహరివనం మండల సాధన కమిటీ నాయకుల ద్వంద్వ వైఖరిని నిరసిస్తూ ఊరి ముఖద్వారం వద్ద ఉన్న “రాజకీయ నాయకులకు ప్రవేశం లేదు” అనే వివాదాస్పద బోర్డుపై శుక్రవారం తెలుపు రంగు పెయింట్ పూసివేశారు.

పాత ఫైల్ ఫొటో

గ్రామ అభివృద్ధి విషయంలో ఎవరి స్వార్థాన్ని సహించేది లేదని, ఇకపై గ్రామాభివృద్ధికి పాటుపడే రాజకీయ నాయకులు, అధికారులు ఎవరైనా గ్రామానికి స్వేచ్ఛగా రావచ్చని గ్రామస్తులు స్పష్టం చేశారు.