హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్, రిమాండ్

అమరావతి నగర్‌లో భర్తను బావతో కలిసి పథకం ప్రకారం హత్య చేయించిన వివాహిత ★ మృతుడి గొంతును లుంగీతో బిగించి, ఛాతీపై పొడిచి, గొంతుకోసి చంపిన బావ గిడ్డయ్యగారి వీరేశ్ ★ కేసు నమోదు చేసి నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన ఆదోని వన్ టౌన్ పోలీసులు.

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని అమరావతి నగర్‌లో వివాహేతర సంబంధం, కుటుంబ కలహాల నేపథ్యంలో అరికెర గ్రామానికి చెందిన వీరేశ్ (మృతుడు) అనే వ్యక్తిని అతడి తోడల్లుడు గిడ్డయ్యగారి వీరేశ్ దారుణంగా హత్య చేయగా, హత్యకు ప్రేరేపించిన మృతుడి భార్య శైలజతో పాటు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న పోలీసులు ఫైల్ ఫోటో

పోలీసులు వెల్లడించిన వివరాలు ఇవిధంగా ఉన్నాయి.. అమరావతి నగర్‌కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లలో అక్క అఖిలను చిన్నహరివాణానికి చెందిన గిడ్డయ్యగారి వీరేశ్, చెల్లెలు శైలజను అరికెర గ్రామానికి చెందిన వీరేశ్ వివాహం చేసుకున్నారు. అయితే, గిడ్డయ్యగారి వీరేశ్ తన మరదలు శైలజతో వివాహేతర సంబంధం కొనసాగించాడు. ఈ విషయం తెలిసి భర్త అరికెర వీరేశ్ భార్యతో తరచూ గొడవపడుతూ కొడుతుండేవాడు. భర్త వేధింపులు తాళలేక శైలజ తన బావతో మాట్లాడి, భర్తను ఎలాగైనా హతమార్చాలని కోరింది.

మృతుడు వీరేష్ ఫైల్ ఫోటో

ఈ క్రమంలో సెప్టెంబర్ 18న గణేష్ నిమజ్జనం కోసం కుటుంబ సభ్యులంతా అమరావతి నగర్‌కు వచ్చారు. ఆ సమయంలో భార్యపై ఆగ్రహంతో అరికెర వీరేశ్ ఆమె ఛాతీపై కాలితో తన్నాడు. ఆ తర్వాత ఆసుపత్రికి వెళ్లి వచ్చిన అనంతరం, నిందితుడు గిడ్డయ్యగారి వీరేశ్ తన మరదలి మాటలను మనసులో ఉంచుకుని అరికెర వీరేశ్‌ను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు.

సెప్టెంబర్ 18వ తేదీ అర్ధరాత్రి బహిర్భూమి నెపంతో బాధితుడిని బయటకు తీసుకెళ్లిన నిందితుడు, తన లుంగీతో అతడి గొంతు బిగించాడు. బాధితుడు ప్రతిఘటించే క్రమంలో నిందితుడి చేతులు, వీపుపై కొరికినప్పటికీ, నిందితుడు అతడిని నేలపై పడేసి శైలజ పచ్చబొట్టు ఉన్న ఛాతీ భాగంలో కత్తితో పొడిచి, అనంతరం గొంతు కోసి పరారయ్యాడు.

హత్యకు ప్రేరేపించిన శైలజను, ప్రత్యక్షంగా హత్యకు పాల్పడిన గిడ్డయ్యగారి వీరేశ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆదోని వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పి. చంద్రశేఖర్ తెలిపారు. నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 103(1) r/w 3(5) కింద కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.