కర్నూలు జిల్లా : రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల విశిష్ట గుర్తింపును సాధించింది. విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షిక అవార్డుల ప్రదానోత్సవంలో కళాశాలకు “ఉత్తమ ఎన్ఎస్ఎస్ (NSS) యూనిట్” పురస్కారం లభించింది.

విద్యార్థుల్లో సేవాభావాన్ని పెంపొందిస్తూ కళాశాల యూనిట్ చేపట్టిన పలు సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించి విశ్వవిద్యాలయం ఈ అవార్డును ప్రకటించింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ జోనాథన్ విక్లిఫ్ పాల్గొని, విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ విజయ్ కుమార్ గౌడ్, ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త ప్రొఫెసర్ కవితల చేతుల మీదుగా ప్రశంసా పత్రం, జ్ఞాపికను స్వీకరించారు. ఈ ఘనత సాధించడం పట్ల కళాశాల యాజమాన్యం, అధ్యాపక బృందం మరియు విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ ఎన్ఎస్ఎస్ బృందానికి అభినందనలు తెలియజేశారు. సమాజ నిర్మాణంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల సేవలు ఎనలేనివని, ఈ అవార్డు కళాశాలకు మరింత బాధ్యతను పెంచిందని నిర్వాహకులు పేర్కొన్నారు.