ఆదోని: గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ నెల అక్టోబర్ 2వ తేదీ (శుక్రవారం) నాడు ఆదోని పట్టణంలో అన్ని రకాల మాంసం విక్రయాలు మరియు వ్యాపారాలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు పురపాలక సంఘం కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.
గాంధీ జయంతి సందర్భంగా పట్టణ పరిధిలోని మటన్, చికెన్ దుకాణాలతో పాటు అన్ని రకాల నాన్-వెజిటేరియన్ వ్యాపారాలను నిలిపివేయాలని ఆయన స్పష్టం చేశారు. అలాగే నాన్-వెజిటేరియన్ హోటళ్లను సైతం తెరవకూడదని, చిన్న మరియు పెద్ద కబేళాలు (స్లాటర్ హౌస్లు) లేదా కటికెల వద్ద జంతువులు, పక్షులను వధించరాదని ఆదేశించారు. ఈ నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా విక్రయాలు జరిపినా లేదా జంతువులను వధించినా వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. పట్టణంలోని వ్యాపారులు, హోటళ్ల నిర్వాహకులు మరియు ప్రజలు ఈ ఆదేశాలను పాటించి సహకరించాలని కోరారు.