జన విజ్ఞాన వేదిక రాష్ట్రవ్యాప్త పర్యటనల్లో భాగంగా మంగళవారం కర్నూలు జిల్లా నాయకులతో కలిసి జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు మాణిక్యం శెట్టి ఆదోని మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ప్రారంభించిన కళాశాలల నిర్మాణాలు ప్రస్తుతం అర్ధాంతరంగా నిలిచిపోవడం విచారకరమన్నారు. ఆదోని వంటి వెనుకబడిన ప్రాంతాల్లో మెడికల్ కాలేజీ అందుబాటులోకి వస్తే పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఉచిత నాణ్యమైన వైద్య సేవలతో పాటు నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.


కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు సన్నాహాలు చేయడం ప్రజారోగ్య రంగానికి గొడ్డలిపెట్టు అని తీవ్రంగా ఖండించారు. ఈ విధానం వల్ల పేదలకు వైద్యం భారంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న అన్ని మెడికల్ కాలేజీలను సందర్శించిన అనంతరం సమగ్ర నివేదికతో ప్రభుత్వానికి మెమోరాండం సమర్పిస్తామని, పనులన్నీ ప్రభుత్వ నిధులతోనే పూర్తయ్యేలా ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక కర్నూలు జిల్లా, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.