కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ ఆదోని నార్త్ మండలం ఎస్సీ మోర్చా అధ్యక్షుడు యువరాజ్ ఆ పార్టీకి రాజీనామా చేసి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదోని మాజీ ఎమ్మెల్యే వై.సాయి ప్రసాద్ రెడ్డి సమక్షంలో ఆయన తన అనుచరులతో కలిసి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా సాయి ప్రసాద్ రెడ్డి యువరాజ్‌కు వైఎస్సార్‌సీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా యువరాజ్ మాట్లాడుతూ స్థానిక బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వ్యవహారశైలిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే చేస్తున్న మోసపూరిత రాజకీయాలు నచ్చకే తాను పార్టీని వీడాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.

“ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి సిద్ధాంతం ఒక్కటే… దోచుకో, దాచుకో, హైదరాబాద్‌కు తరలించుకో. నియోజకవర్గ అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేసి స్వార్థ రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఆయన అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు తీవ్ర అసంతృప్తిని కలిగించాయి. పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని నమ్మి, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి నాయకత్వంలో పనిచేసేందుకు వైఎస్సార్‌సీపీలో చేరాను” అని యువరాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
