న్యాయవాది మల్లికార్జునపై దాడి హేయం.. ఉమాపతి నాయుడు

టీడీపీ స్టేట్ లీగల్ సెల్ సభ్యులు, న్యాయవాది మల్లికార్జునపై పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగిన దాడిని టీడీపీ సీనియర్ నాయకులు కొంకా ఉమాపతి నాయుడు తీవ్రంగా ఖండించారు. ఈ దాడి నేపథ్యంలో పార్టీ నాయకులతో కలిసి ఉమాపతి నాయుడు నేరుగా మల్లికార్జున నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకుని, బాధితుడికి పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.

న్యాయవాది మల్లికార్జున తో మాట్లాడుతున్న టిడిపి నాయకులు

అనంతరం ఆదోని పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమాజానికి న్యాయాన్ని అందించే న్యాయవాదుల మధ్య ఇలాంటి భౌతిక దాడులు చోటుచేసుకోవడం అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న సీనియర్ న్యాయవాది పురుషోత్తం రెడ్డి మరో న్యాయవాదితో వాగ్వాదానికి దిగడం, అది ఘర్షణకు దారితీయడం ఆందోళనకరమన్నారు. న్యాయవాదుల మధ్య ఏవైనా విభేదాలుంటే సంయమనంతో, చట్టపరంగా లేదా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలే తప్ప భౌతిక దాడులకు దిగడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని స్పష్టం చేశారు.

పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్న టిడిపి నాయకులు

అందులో పోలీస్ స్టేషన్ ఎదుటే ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని పేర్కొన్న ఆయన, దీనిపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తేవాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పోలీసు యంత్రాంగాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రంగస్వామి నాయుడు, రాష్ట్ర హౌసింగ్ బోర్డు డైరెక్టర్ రామకృష్ణ, బుద్ధారెడ్డి, పట్టణ అధ్యక్షులు తిమ్మప్ప, జిందే శంకర్, రంగన్న, కృష్ణారెడ్డి, గిడ్డయ్య, పీరా, శివ, గుండప్ప తదితరులు పాల్గొన్నారు.