వేల కోట్ల దోపిడియత్నం హ్యాకర్లు ఎవరన్నదీ మిస్టరీ

ప్రపంచంలోనే అత్యంత పకడ్బందీ సెక్యూరిటీని సైతం బోల్తా కొట్టించి, ఏకంగా 1 బిలియన్ డాలర్లను (సుమారు రూ. 8,300 కోట్లు) కొల్లగొట్టేందుకు ఆ హ్యాకర్లు వేసిన స్కెచ్ మామూలుది కాదు. ఏడాది పాటు కంటికి కనిపించకుండా నెట్‌వర్క్‌ను జల్లెడ పట్టారు. మూడు దేశాల టైమ్ జోన్లు, సెలవులను లెక్కలేసి పక్కా ప్లాన్ వేశారు. కానీ, ఇంతటి కట్టుదిట్టమైన ప్లాన్‌లో ఐదవ తరగతి పిల్లాడు కూడా చేయని ఒక చిన్న తప్పు దొర్లింది. కేవలం ఒకే ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్… వేల కోట్ల దోపిడీ కలను నీరుగార్చింది!

ఏఐ క్రియేట్ ఇమేజ్

ఈ నేరానికి బీజం పడింది జనవరి 2015లో. బంగ్లాదేశ్ సెంట్రల్ బ్యాంక్ సర్వర్‌కు ఉద్యోగ దరఖాస్తు (CV) పేరుతో ఒక జిప్ ఫైల్ ఈమెయిల్ రూపంలో వచ్చింది. సాధారణ మెయిల్ అనుకుని బ్యాంకులోని ముగ్గురు ఉద్యోగులు ఆ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేశారు. కానీ ఆ ఫైల్‌లో ప్రమాదకరమైన మాల్వేర్ (“Malicious Software”) (హానికరమైన సాఫ్ట్‌వేర్) దాగి ఉంది. ముగ్గురు ఉద్యోగులు తెరిచిన ‘చోర దర్వాజా’ (దొడ్డి దారి) : అది నెట్‌వర్క్‌లో ఒక ‘చోర దర్వాజా’ను తెరిచింది. బ్యాంకు సిబ్బంది ఎప్పుడు లాగిన్ అవుతున్నారు? లావాదేవీలు ఎలా ఆమోదిస్తున్నారు? సెలవుల్లో ఏ సిస్టమ్స్ ఆన్‌లో ఉంటున్నాయి? ఇలాంటి అత్యంత రహస్య వివరాలన్నింటినీ ఆ మాల్వేర్ రికార్డ్ చేసి హ్యాకర్లకు చేరవేసింది.

ఏఐ క్రియేట్ ఇమేజ్

అసాధ్యమైన నెట్‌వర్క్‌పై గురి: ఈ నిఘాలోనే హ్యాకర్లకు ఒక కీలక సమాచారం అందింది. బంగ్లాదేశ్ విదేశీ మారక ద్రవ్య నిధులు న్యూయార్క్‌లోని ‘ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్’లో డిపాజిట్ అయి ఉన్నాయి. అక్కడి నుంచి నిధులు బదిలీ కావాలంటే ప్రపంచ బ్యాంకులు ఉపయోగించే అత్యంత సురక్షితమైన SWIFT (స్విఫ్ట్) సిస్టమ్‌ను దాటాలి. స్విఫ్ట్ నెట్‌వర్క్‌ను నేరుగా హ్యాక్ చేయడం దాదాపు అసాధ్యం. దాంతో ఆ వ్యవస్థను ఆపరేట్ చేసే బ్యాంకు కంప్యూటర్లనే తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని హ్యాకర్లు నిర్ణయించుకున్నారు. నెలల తరబడి బ్యాంకు ఉద్యోగుల కదలికలు, లావాదేవీల నమూనాలను కాపీ కొట్టారు. దొంగిలించిన సొమ్మును దాచేందుకు మే 2015లోనే ఫిలిప్పీన్స్‌లో నకిలీ పేర్లతో ఐదు ఖాతాలు, శ్రీలంకలో ఒక ఖాతాను సిద్ధం చేశారు.

ఏఐ క్రియేట్ ఇమేజ్

టైమింగ్ లెక్కల్లో తిరుగులేని మాస్టర్ ప్లాన్: ఫిబ్రవరి 4, 2016 – గురువారం రాత్రి. బంగ్లాదేశ్ బ్యాంకు ఉద్యోగులు పని ముగించుకుని ఇళ్లకు వెళ్లగానే హ్యాకర్లు రంగంలోకి దిగారు. న్యూయార్క్ ఫెడ్ నుంచి మొత్తం $951 మిలియన్ల బదిలీ కోసం వరుసగా 36 స్విఫ్ట్ రిక్వెస్ట్‌లను పంపించారు. ఇక్కడ వారి టైమింగ్ లెక్కలు చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. బంగ్లాదేశ్: గురువారం రాత్రి పని మొదలుపెట్టారు; శుక్రవారం అక్కడ అధికారిక వీకెండ్ సెలవు మొదలైంది. న్యూయార్క్: బంగ్లాదేశ్‌లో శుక్రవారం తెల్లవారుజాము సమయానికి న్యూయార్క్‌లో గురువారం రాత్రి/శుక్రవారం ఉదయం. అక్కడి అధికారులు ఈ రిక్వెస్టులను సాధారణ లావాదేవీలుగా భావించి ప్రాసెస్ చేయడం ప్రారంభించారు. ఫిలిప్పీన్స్: అటు నుంచి డబ్బు ఫిలిప్పీన్స్ చేరే సమయానికి అక్కడ సోమవారం చైనీస్ న్యూ ఇయర్ సెలవు. అంటే బ్యాంకులకు వరుస సెలవులు ఉండేలా చూసుకుని, మోసం బయటపడకుండా నాలుగు రోజుల గడువును హ్యాకర్లు సిద్ధం చేసుకున్నారు.

ఏఐ క్రియేట్ ఇమేజ్

అడ్డంగా బుక్కైన ఆ ఒక్క అక్షరం!: న్యూయార్క్ ఫెడ్ వరుసగా డబ్బులు విడుదల చేస్తూ పోయింది. అప్పటికే ఫిలిప్పీన్స్ ఖాతాల్లోకి $81 మిలియన్లు జమైపోయాయి. ఆ తర్వాత శ్రీలంకలోని ఒక ఎన్జీవోకు $20 మిలియన్లు పంపే ట్రాన్సాక్షన్ మొదలైంది. అక్కడే అసలు ట్విస్ట్ ఎదురైంది! హ్యాకర్లు ఆ ఎన్జీవో పేరు ‘Shalika Foundation’ అని రాయబోయి, తొందరపాటులో ‘o’ అక్షరాన్ని వదిలేసి ‘Fandation’ అని టైప్ చేశారు. ఈ లావాదేవీ జర్మన్ బ్యాంక్ డ్యుయిష్ బ్యాంక్ సర్వర్ల ద్వారా వెళ్తున్నప్పుడు, అక్కడి ఆటోమేటెడ్ వ్యవస్థ ఈ తప్పు స్పెల్లింగ్‌ను గుర్తించి అలర్ట్ జారీ చేసింది. వెంటనే అప్రమత్తమైన న్యూయార్క్ ఫెడ్ అనుమానంతో మిగిలిన అన్ని లావాదేవీలను తక్షణమే నిలిపివేసింది. ఫలితంగా మిగతా $850 మిలియన్ల నగదు (దాదాపు రూ. 7,000 కోట్లు) తరలిపోకుండా ఆగిపోయింది.

ఏఐ క్రియేట్ ఇమేజ్

మాయమైన ఆధారాలు.. అంతుచిక్కని మిస్టరీ: హ్యాకర్లు ముందస్తు జాగ్రత్తగా బంగ్లాదేశ్ బ్యాంకులోని లేజర్‌జెట్ ప్రింటర్‌ను కూడా హ్యాక్ చేసి ఉంచారు. లావాదేవీల రసీదులు బయటకు రాకుండా అది కేవలం తెల్ల కాగితాలను మాత్రమే ప్రింట్ చేసేలా ప్రోగ్రామ్ చేశారు. అందుకే శనివారం ఉదయం వరకు అక్కడి అధికారులకు ఏం జరిగిందో కూడా తెలియలేదు. ఇక ఫిలిప్పీన్స్‌‌కు చేరిన $81 మిలియన్లను నేరగాళ్లు మనీలాలోని క్యాసినోల ద్వారా చిప్స్‌గా మార్చి, చివరకు హాంకాంగ్‌కు తరలించి వైట్‌మనీగా మార్చుకున్నారు.

ఫైల్ ఫోటో

ఈ భారీ సైబర్ దాడి జరిగి ఏళ్ళు గడుస్తున్నా, ఆ మిగిలిన $81 మిలియన్ల నగదు జాడ దొరకలేదు, అసలు ఆ హ్యాకర్లు ఎవరన్నదీ ఇప్పటికీ ప్రపంచానికి అంతుచిక్కని మిస్టరీగానే మిగిలిపోయింది. బంగ్లాదేశ్ బ్యాంకుకు వేల కోట్లు పోయాయన్న బాధ ఉన్నా… ఆ రోజు దొర్లిన ఒకే ఒక్క చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ వల్ల $850 మిలియన్ల ఖజానా సేఫ్‌గా మిగిలింది!