గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, అధికారం అండతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై భౌతిక దాడులకు పాల్పడటం దుర్మార్గమని వైఎస్సార్‌సీపీ యువనేత జయ మనోజ్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకుడ్లూరు గ్రామంలో ఆదివారం రాత్రి పొలంలో పనిచేసుకుంటున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఎర్రస్వామిపై కూటమికి చెందిన మధు, సోము, కేశవ అనే వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎర్రస్వామిని జయ మనోజ్ రెడ్డి సోమవారం స్వయంగా పరామర్శించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న ఆయన, “ఎవరూ అధైర్యపడొద్దు.. పార్టీ మీకు అన్ని విధాలా అండగా ఉంటుంది, నేను ఉన్నాను” అంటూ బాధితుడి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.

అనంతరం జయ మనోజ్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నాడన్న అక్కసుతోనే ఎర్రస్వామిపై దుర్భాషలాడుతూ విచక్షణారహితంగా దాడి చేశారని ఆరోపించారు. ప్రభుత్వం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా దాడులు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. రాజకీయాల్లో పార్టీలు, ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయని.. గ్రామాల్లో ప్రజల మధ్య కక్షలు పెంచకుండా ప్రశాంత వాతావరణాన్ని కాపాడాలని హితవు పలికారు. సమస్యలు ఏవైనా ఉంటే సామరస్యంగా కూర్చొని మాట్లాడుకోవాలే తప్ప, ఇలా దాడులకు దిగడం హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని, ఇటువంటి చర్యలను సహించబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆదోని పట్టణ అధ్యక్షుడు బి. దేవా, మండల యూత్ అధ్యక్షుడు నల్లారెడ్డి, ప్రతాపరెడ్డిలతో పాటు పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.