రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆదోని పట్టణంలో పోలీసులు భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఆదోని ఏఎస్పీ జయశర్మ ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం ఆదోని 1 టౌన్ పరిధిలోని పలు లాడ్జీలు, హోటళ్లు, సత్రాలలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హోటళ్లలో బస చేస్తున్న వ్యక్తుల గుర్తింపు కార్డులు (ఐడీ ప్రూఫ్స్), రిజిస్టర్లలోని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి అసాంఘిక శక్తులు లేదా రౌడీషీటర్లు ఎవరైనా ఆశ్రయం పొందుతున్నారా అన్న కోణంలో ప్రతి గదినీ పరిశీలించారు. ఎన్నికల వేళ పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను కట్టడి చేయడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా సీఐ ఎం. యుగంధర్ మాట్లాడుతూ.. లాడ్జీల నిర్వాహకులు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. కొత్త వ్యక్తులు గదులు తీసుకునే సమయంలో సరైన గుర్తింపు కార్డులు లేకుండా అనుమతించరాదని, అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) ఎం. యుగంధర్ ఆధ్వర్యంలో, సబ్-ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) గోపాలరాజు మరియు పోలీస్ సిబ్బందితో కలిసి ఈ తనిఖీలు చేపట్టారు.
