పెట్రోల్ దాడికి గురైన పారిశుద్ధ్య కార్మికురాలు నరసమ్మ మృతి

కర్నూలు జిల్లా ఆదోనిలో కొద్దిరోజుల క్రితం పెట్రోల్ దాడికి గురైన పారిశుద్ధ్య కార్మికురాలు నరసమ్మ (30) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ నెల 6వ తేదీన స్థానిక బస్టాండ్ పరిసరాల్లో విధి నిర్వహణలో ఉన్న ఆమెపై గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా దాడి చేశారు. ముందుగా ఆమె కళ్లలో కారం కొట్టి, అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్ర గాయాలపాలైన నరసమ్మను స్థానికులు, అధికారులు వెంటనే ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయినప్పటికీ పరిస్థితి మరింత దిగజారడంతో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచింది.

చికిత్స పొందుతూ మృతి చెందిన నరసమ్మ

ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. వివాహేతర సంబంధం, వ్యక్తిగత కక్షల వల్లే ఈ హత్య జరిగినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం.. నరసమ్మ భర్త వెంకటేశ్ నాలుగేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం ఆమెకు చిన్న ఈరన్న (35) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అయితే, కొద్దిరోజుల తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో చిన్న ఈరన్న కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్న ఈరన్న ఆత్మహత్యకు నరసమ్మే కారణమని భావించిన అతని కుటుంబ సభ్యులు ఆమెపై తీవ్ర కక్ష పెంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే పథకం ప్రకారం ఆమె విధుల్లో ఉన్న సమయంలో కళ్లలో కారం చల్లి, పెట్రోల్ పోసి సజీవ దహనానికి యత్నించినట్లు విచారణలో వెల్లడైంది.

నిందితులను అరెస్టు చేసి మీడియాకు చూపిస్తున్న పోలీసులు

ఈ ఘాతుకానికి పాల్పడిన చిన్న ఈరన్న కుటుంబ సభ్యులతో పాటు, సంబంధిత నిందితులను ఇప్పటికే అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా కార్మికురాలు హత్యకు గురికావడంతో తోటి పారిశుద్ధ్య సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మీడియా ముందు హాజరు పరుస్తున్న పోలీసులు