రైలు కూత పెట్టింది.. ఆ కూత వెనుక ఒక నిండు ప్రాణం ముక్కలైపోయింది. ఆదోని–ఇస్వి రైల్వే ట్రాక్‌పై రక్తమోడిన మలేష్ అనే ఆటో డ్రైవర్ మృతదేహం కేవలం ఒక ప్రమాద ఘటన మాత్రమే కాదు; సమాజంలో వేళ్లూనుకుపోయిన అక్రమ వడ్డీ వ్యాపార వ్యవస్థ చేస్తున్న నిశ్శబ్ద హత్యలకు ప్రత్యక్ష సాక్ష్యం. ఎదపై భార్య పేరు ‘రోజా’ అని పచ్చబొట్టు వేయించుకున్న ఆ చేతులు, తన కుటుంబాన్ని బతికించుకోలేక, అప్పుల బాధను తాళలేక చివరకు రైలు పట్టాలనే శరణుగా ఎంచుకున్నాయి.

అవసరానికి ఆసరా కాదు.. మెడకు ఉచ్చు!రోజంతా ఆటో నడిపితే వచ్చే నాలుగు వందల రూపాయలతో సంసారాన్ని నెట్టుకురావడం సామాన్యుడికి గగనమైపోతోంది. ఇలాంటి బలహీనతలే వడ్డీ వ్యాపారులకు పెట్టుబడి. రోజువారీ మీటర్ వడ్డీలు, చక్రవడ్డీలు, కళ్లముందే పుట్టుకొచ్చే లేనిపోని లెక్కలు.. ఇలా ఐదారు లక్షల అప్పు తెచ్చిన మలేష్ను నిలువునా పిండేసి ఉంటాయి. తీసుకున్న అసలు కంటే కట్టిన వడ్డీలే రెట్టింపైనా, వ్యాపారుల దౌర్జన్యాలు, ఇంటికొచ్చి చేసే పరువు నష్టాలు సామాన్యుడి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తాయి. తాగుడు వ్యసనం కావచ్చు, కానీ ఆ వ్యసనానికి ఆజ్యం పోసే మానసిక వేదన వెనుక ఈ అక్రమ రుణాల ఒత్తిడే ప్రధాన కారణం.

◆ చట్టాలు ఉన్నా.. ఆగని దౌర్జన్యాలు: అక్రమ వడ్డీల నియంత్రణకు చట్టాలు ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ప్రైవేట్ ఫైనాన్షియర్లు, వడ్డీ వ్యాపారులు సాగిస్తున్న దందా ఆగడం లేదు. ఖాళీ ప్రామిసరీ నోట్లు, సంతకాలు పెట్టిన చెక్కులు, ఆధార్ కార్డులను తాకట్టు పెట్టుకుని ప్రజల రక్తాన్ని జలగల్లా పీల్చేస్తున్నారు. వాయిదా తప్పితే ఇంటి ముందుకొచ్చి మహిళలను సైతం చూడకుండా అసభ్య పదజాలంతో దూషించడం, మానసిక హింసకు గురిచేయడం వీరి నిత్యకృత్యమైంది. ◆ బలవన్మరణం పరిష్కారం కాదు! అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి: ప్రాణం తీసుకోవడం పిరికితనం మాత్రమే కాదు, మిగిలిన మీ కుటుంబాన్ని అదే రాబందుల చేతుల్లోకి నెట్టేయడమే. మీరు చనిపోతే సమస్య తీరదు; ఆ అప్పుల భారం, వడ్డీ వ్యాపారుల వేధింపులు మీ భార్యాబిడ్డల మెడకే చుట్టుకుంటాయి. ◆ వడ్డీల కంటే ప్రాణం విలువైంది: చట్టవిరుద్ధంగా అధిక వడ్డీలు వసూలు చేసే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసే హక్కు బాధితులకు ఉంది. ◆ ధైర్యంగా ఎదుర్కోండి: సమస్య ఎంత పెద్దదైనా న్యాయపరంగా, కుటుంబ సభ్యుల సహకారంతో పరిష్కరించుకోవచ్చు. జీవితాన్ని ముగించడమే అంతిమ మార్గం అనుకోవడం భ్రమ.

పోలీస్ యంత్రాంగం, అధికార యంత్రాంగం కేవలం ఇలాంటి బలవన్మరణాలపై కేసులు నమోదు చేయడంతో సరిపెట్టకుండా.. మలేష్ లాంటి అభాగ్యులను ఆత్మహత్యల వైపు నెడుతున్న అక్రమ వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. లేకపోతే పట్టాలపై తెగిపడే ప్రతి ప్రాణానికి ఈ సమాజమే జవాబుదారీ కావాల్సి వస్తుంది.
