ఆదోని : రాబోయే పురపాలక ఎన్నికల్లో కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ చైర్‌పర్సన్ పదవిని రోస్టర్ / రొటేషన్ విధానం ప్రకారం ఎస్సీ (షెడ్యూల్డ్ కులాలు) లేదా ఎస్టీ (షెడ్యూల్డ్ తెగలు) వర్గాలకు కేటాయించాలని ఆదోని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ మేరకు అమరావతి రాయపూడిలోని ఏపీసీఆర్‌డీఏ (APCRDA) ప్రాజెక్ట్ కార్యాలయంలో ఉన్న మున్సిపల్ పరిపాలన శాఖ డైరెక్టరేట్ (CDMA) అధికారులైన జాయింట్ డైరెక్టర్ ఎస్. రవీంద్రబాబు, అడిషనల్ డైరెక్టర్ మురళీకృష్ణలను ఆయన కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీల చట్టంలోని రిజర్వేషన్ నిబంధనల ప్రకారం మున్సిపల్ చైర్‌పర్సన్ పదవులను నిర్దేశిత నిష్పత్తి మేరకు రొటేషన్ పద్ధతిలో వివిధ వర్గాలకు కేటాయించాల్సి ఉంటుందని గుర్తుచేశారు. సామాజిక న్యాయం, సమాన రాజకీయ ప్రాతినిధ్యం మరియు రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించాలంటే ఈ రొటేషన్ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని కోరారు. ఆదోని పట్టణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, అణగారిన ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సముచిత స్థానం కల్పించేలా చైర్‌పర్సన్ పదవిని రిజర్వ్ చేయాలని ఆయన అధికారులకు విజ్ఞప్తి చేశారు.