కూటమి ప్రభుత్వంలో రైతుల గోడు పట్టదా?

కూటమి ప్రభుత్వంలో రైతుల గోడు పట్టదా? ఆదోని మండలాన్ని తక్షణమే కరువు మండలంగా ప్రకటించాలి: మాజీ ఎమ్మెల్యే వై. సాయిప్రసాద్ రెడ్డి డిమాండ్

ఆదోని 28 09 2026: దేశానికి వెన్నెముకైన రైతన్న వర్షాలు లేక, పంటలు పండక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కూటమి ప్రభుత్వ నాయకులు, అధికారులు వారి వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు, ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయిప్రసాద్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం సలకలకొండ గ్రామ సమీపంలో ఎండిపోయిన పంట పొలాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల కష్టాలను, పంట నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆదోని మండలాన్ని తక్షణమే కరువు మండలంగా ప్రకటించాలని, పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రైతులు చెల్లించిన బీమా ప్రీమియానికి సంబంధించిన పరిహారాన్ని వెంటనే విడుదల చేయాలని, లేనిపక్షంలో వామపక్షాలు, ఇతర ప్రజాసంఘాలు, అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

పత్తిని పరిశీలిస్తున్న మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి

గతంలో వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల (RBK) ద్వారా రైతులపై ఒక్క రూపాయి కూడా భారం పడకుండా ప్రభుత్వమే ఉచిత పంటల బీమా ప్రీమియం చెల్లించి, నష్టం వాటిల్లినప్పుడు ఎకరాకు లక్షల్లో పరిహారం అందించి ఆదుకుందని గుర్తుచేశారు. ప్రస్తుత కూటమి పాలనలో పెట్టుబడులు పెరిగి, దిగుబడులు రాక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని మండిపడ్డారు.

రైతుల కన్నీటి వ్యథ: మాజీ ఎమ్మెల్యే పర్యటన సందర్భంగా పలువురు రైతులు తమ ఆవేదనను వెళ్లగక్కారు.

మీడియాతో ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతు
  • కృష్ణమ్మ (రైతు): “ఎకరాకు రూ. 30 వేల నుంచి రూ. 40 వేల దాకా పెట్టుబడి పెట్టాం. తీరా చూస్తే క్వింటా కూడా పంట రాలేదు. 16 ఎకరాలకు ఎకరాకు రూ. 2,000 చొప్పున మొత్తం రూ. 32,000 బీమా ప్రీమియం చెల్లించడానికి ఇంట్లోని బంగారు నగలు తాకట్టు పెట్టాం. గతంలో రూ. 1200 ఉన్న ఎరువుల బస్తా ఇప్పుడు రూ. 2300 అయ్యింది. కనీసం ఇన్సూరెన్స్ అయినా వస్తే చేసిన అప్పులు తీరుతాయి.”
  • నాగలక్ష్మి (మహిళా రైతు): “పంటల కోసం, ఇన్సూరెన్స్ కట్టడం కోసం బంగారం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చాం. కనీసం ప్రభుత్వం నుంచి ఇన్సూరెన్స్ పరిహారం కూడా రాకపోతే మా బతుకులు రోడ్డున పడతాయి. కూలీలకు కూడా డబ్బులు చెల్లించలేని దుస్థితిలో ఉన్నాం.”
రైతుల కష్టాలను, పంట నష్టాన్ని అడిగి తెలుసుకుంటున్న మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి, ఆదోని పట్టణ అధ్యక్షుడు బి. దేవా, మండల యూత్ అధ్యక్షుడు నల్లారెడ్డి, టౌన్ సెక్రటరీలు మల్లెల తాయన్న, గాజుల నాగరాజ్, నాయకులు రామ్‌కోటిరెడ్డి, పెద్దయ్య, సోమలింగ, తమన్నా, మెడికల్ నాగరాజు, రామలింగేశ్వర యాదవ్, మధు, శేషిరెడ్డి, వీరేశ్ రెడ్డి, చలపతి, గిడ్డయ్య, మని, చిన్న వీరప్ప, ఆర్.వి. బాబు, నరేష్, కుప్పయ్య, ఉచ్చిరప్ప తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.