రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో శాంతిభద్రతలను పటిష్టంగా కాపాడటానికి, ప్రజలలో భద్రతాభావాన్ని పెంపొందించడానికి పోలీసులు రంగంలోకి దిగారు. కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఆదోని ఏఎస్పీ జయశర్మ ఆదేశాల మేరకు ఆదివారం సాయంత్రం ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు సమస్యాత్మక, కీలక ప్రాంతాలలో పోలీసులు భారీ ఎత్తున ఫుట్ పెట్రోలింగ్ (పాదచార కవాతు) నిర్వహించారు.

వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) ఎం. యుగంధర్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో సబ్-ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) గోపాలరాజు, స్థానిక పోలీస్ సిబ్బందితో పాటు ప్రత్యేక బలగాలు (స్పెషల్ ఫోర్స్) పాల్గొన్నాయి. పట్టణంలోని ఓల్డ్ పోస్ట్ ఆఫీస్, ఖాజిపుర, బొబ్బలమ్మ గుడి, చౌదరి బావి, బోయగేరి, బావాజీ పేట, గణేష్ సర్కిల్, బుద్దేకల్ తదితర ప్రధాన వీధులు, జనసంచారం ఉన్న ప్రాంతాల్లో పోలీసులు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ ఎం. యుగంధర్ మాట్లాడుతూ.. ఎన్నికల వేళ ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పట్టణ ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని, ఏదైనా అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పటిష్ట నిఘా ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు.
