కర్నూలు జిల్లా ఆదోని : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామమైన నాగనాథనహళ్లిలో పోలీసులు ఆదివారం ఉదయం విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. కర్నూలు జిల్లా ఎస్పీ, ఆదోని ఏఎస్పీ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టారు.

ఈ కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమంలో ఆదోని రూరల్ సీఐ నల్లప్ప, రూరల్ ఎస్సై రామాంజనేయులు, ఇస్వి ఎస్సై మహేష్ కుమార్లతో పాటు దాదాపు 35 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఉదయం 6 గంటలకే గ్రామానికి చేరుకున్న పోలీసులు గ్రామం నలుమూలలా గస్తీ నిర్వహించారు. సమస్యాత్మక వ్యక్తుల ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా పోలీసులు గ్రామస్తులతో మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికలలో ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా, అల్లర్లకు పాల్పడినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

తనిఖీల్లో భాగంగా గ్రామంలో సరైన ధ్రువపత్రాలు (డాక్యుమెంట్లు) లేని 6 ద్విచక్ర వాహనాలతో పాటు ఒక సుమో వాహనాన్ని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలంతా పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు.