స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి స్ట్రాంగ్ రూమ్లు, రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్, కౌంటింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లను గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు. కర్నూలు జిల్లా శుక్రవారం జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్తో కలిసి ఆమె ఆదోని ఆర్ట్స్ కళాశాల, ఎమ్మిగనూరు నవోదయ విద్యాలయం, జూనియర్ కళాశాలల్లోని కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పోలింగ్ సిబ్బందికి ఇబ్బంది కలగకుండా స్పష్టమైన సైన్ బోర్డులు, రవాణాకు ప్రత్యేక రూట్ ప్లాన్, పార్కింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పటిష్టమైన పోలీసు బందోబస్తు ఉండాలని, సిబ్బందికి తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు కల్పించాలని స్పష్టం చేశారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ పరిశీలనలో ఆర్డీవో అరుణ దేవి, అడిషనల్ ఎస్పీ జయ శర్మ, మున్సిపల్ కమిషనర్లు నయీం అహ్మద్, గంగిరెడ్డి, డీఎస్పీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
