కర్నూలు జిల్లా ఆదోని పురపాలక సంఘం (మున్సిపల్) చైర్మన్ అభ్యర్థి ఎంపికపై నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. కూటమి ప్రభుత్వ నిర్ణయం మేరకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదోని మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా నాగమణి పేరును అధికారికంగా ఖరారు చేసింది.

ఈ పదవి కోసం పార్టీలోని పలువురు నేతల పేర్లు పరిశీలనలోకి వచ్చినప్పటికీ, నియోజకవర్గ సమీకరణాలు, విధేయతను పరిగణనలోకి తీసుకుని అధిష్టానం నాగమణి వైపే మొగ్గు చూపింది. ప్రముఖ నాయకుడు మారుతి నాయుడు సోదరి అయిన నాగమణి పేరును ప్రకటించడంతో ఆదోని పట్టణ రాజకీయాల్లో నూతనోత్సాహం నెలకొంది. ఈ నిర్ణయంతో మాజీ ఎమ్మెల్యే కే. మీనాక్షి నాయుడు వర్గంలో సంబరాలు మిన్నంటాయి. పార్టీ శ్రేణులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు మారుతి నాయుడు అత్యంత సన్నిహితంగా ఉంటారనే చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా ఉన్న నేపథ్యంలో, ఆయన కుటుంబానికే ఈ కీలక అవకాశం దక్కడం స్థానికంగా ప్రాధాన్యత సంతరించుకుంది. నాగమణి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం పట్ల పలువురు కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.