కౌతాళంలో గ్యాస్ గోడౌన్ ఆకస్మిక తనిఖీ చేసిన ఆర్డీవో అరుణ దేవి

ఆదోని, సెప్టెంబర్ 30: గ్యాస్ సిలిండర్ల డెలివరీ సమయంలో వినియోగదారుల నుంచి ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆదోని ఆర్డీవో అరుణ దేవి హెచ్చరించారు.

గ్యాస్ గోడౌన్ తనిఖీ నిర్వహిస్తున్న ఆర్డిఓ అరుణాదేవి

బుధవారం మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండల కేంద్రంలోని గ్యాస్ గోడౌన్‌ను స్థానిక తహసీల్దార్‌, సీఎస్‌డీటీ, డీఐఓలతో కలిసి ఆదోని ఆర్డీవో అరుణ దేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోడౌన్‌లోని సిలిండర్ల నిల్వలు, పంపిణీ రిజిస్టర్లు, సరఫరా విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.

దీపం పథకం లబ్ధిదారులకు నేరుగా మాట్లాడుతున్న ఆర్డిఓ

అనంతరం కౌతాళం, యరిగిరి గ్రామాల్లో ‘దీపం’ పథకం లబ్ధిదారులతో ఆర్డీవో నేరుగా మాట్లాడారు. డెలివరీ సమయంలో చెల్లించాల్సిన అసలు ధరలు, అనుమతించిన ఛార్జీల వివరాలను వారికి వివరించారు. ఎవరైనా డెలివరీ బాయ్స్ లేదా ఏజెన్సీ నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా అదనపు మొత్తాలు డిమాండ్ చేస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. గ్యాస్ ఏజెన్సీలు నిబంధనలు అతిక్రమించకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

ఆర్డీవో తనిఖీ చేస్తున్న వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష రీ-సర్వే పనులను

గోడౌన్ తనిఖీ అనంతరం కౌతాళంలో ఫేజ్-6 కింద జరుగుతున్న వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష రీ-సర్వే గ్రౌండ్ ట్రూతింగ్ (జీటీ) పనులను ఆర్డీవో పరిశీలించారు. పనుల పురోగతిని మ్యాపుల ద్వారా తనిఖీ చేసి, క్షేత్రస్థాయి సిబ్బందికి పలు సూచనలు చేశారు. నిర్దేశిత గడువులోగా, నాణ్యతా ప్రమాణాలతో, ఎలాంటి వివాదాలకు తావులేకుండా రీ-సర్వే పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కౌతాళం తహసీల్దార్‌, సివిల్ సప్లైస్ అధికారులు, సర్వే సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

దీపం పథకం లబ్ధిదారులకు నేరుగా మాట్లాడుతున్న ఆర్డిఓ