కర్నూలు జిల్లా ఆదోని పురపాలక ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారింది. కూటమి పార్టీల మధ్య విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. టీడీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి నాగమణి నామినేషన్ కార్యక్రమానికి జనసేన శ్రేణులు పూర్తిగా దూరంగా ఉండటంతో పాటు, కూటమి నిర్ణయాన్ని ధిక్కరిస్తూ జనసేన రెబల్ అభ్యర్థిని బరిలోకి దించడంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
టీడీపీ అభ్యర్థి నామినేషన్ ర్యాలీలో జనసేన నాయకులు, కార్యకర్తలు ఎవరూ కనిపించకపోవడంతో క్షేత్రస్థాయిలో సహకారం అందడం లేదంటూ టీడీపీ వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు, ఆదోని జనసేన పట్టణ అధ్యక్షుడు మల్లప్ప సతీమణి స్వప్న స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడంతో కూటమిలో ముసలం మొదలైంది. పోటాపోటీ నామినేషన్లతో పట్టణంలో తీవ్ర రాజకీయ ఉత్కంఠ నెలకొంది.

సతీమణి స్వప్న నామినేషన్ అనంతరం మల్లప్ప మీడియాతో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు కృష్ణమ్మలను ఉద్దేశించి ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. “ఆదోనిలో జనసేన పార్టీ చేసిన పాపం ఏంటి? కనీసం మున్సిపల్ చైర్మన్ పదవికి కూడా మేము నోచుకోమా? నన్ను తమ్ముడు, కొడుకు అని పిలుస్తారు కదా.. నా విషయం పక్కన పెట్టినా, మీ బిడ్డ సమానురాలైన స్వప్నమ్మకు న్యాయం చేయాలని వాపోయారు.

2019 ఎన్నికల్లో తాను పోటీ చేసి 12 వేల ఓట్లు సాధించానన్న అక్కసుతోనే తన రాజకీయ భవిష్యత్తును సమాధి చేసేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని మల్లప్ప మండిపడ్డారు. తాను ఆదోనిలో ఉండనంటూ పనిగట్టుకుని చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఇకనైనా మానుకోవాలని హెచ్చరించారు.

ఆరోజు ఎమ్మెల్యే టికెట్ కోల్పోవడానికి డబ్బే కారణం.. ఈరోజు మున్సిపల్ చైర్మన్ పదవి దక్కకపోవడానికి కూడా ఆ డబ్బే కారణం” అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కుటుంబ పోషణ కోసం, ప్రజలకు సేవ చేయడం కోసం తాను కష్టపడి సంపాదించుకోవడంలో తప్పేముందని ప్రశ్నించారు. అప్పులపాలైనా, సర్వస్వం కోల్పోయినా తాను సంపాదించే రూపాయిలో అర్ధరూపాయి ప్రజాసేవకే ఖర్చు చేస్తున్నానని, తమపై తప్పుడు ఆరోపణలు చేసేవారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు.
