కర్నూలు జిల్లా ఆదోని పట్టణ పరిధిలోని అమరావతి నగర్లో శనివారం దారుణ ఘటన చోటుచేసుకుంది. అరేకేరి గ్రామానికి చెందిన వీరేష్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికులు, మృతుడి కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. వీరేష్ అమరావతి నగర్‌లోని తన అత్తగారింటికి వచ్చాడు.

ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు అతడిపై పొలంలో దాడి చేసి హత్య చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతుడు వీరేష్‌కు భార్య శైలు, మూడు నెలల పసిపాప ఉన్నారు. పసిబిడ్డ ఉన్న సమయంలో కుటుంబ పెద్ద దిక్కును కోల్పోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పాత కక్షలేమైనా ఉన్నాయా లేక ఇతర కారణాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

