కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఆధ్వర్యంలో కొలువుదీరిన మొదటి వినాయకుడి నిమజ్జన శోభాయాత్ర శుక్రవారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. నిమజ్జనానికి ముందు నిర్వహించిన వేలంపాటల్లో భక్తులు పోటాపోటీగా పాల్గొన్నారు.


ప్రతిష్టాత్మక వీహెచ్‌పీ గణనాథుడి లడ్డూ ప్రసాదాన్ని బసపురం గ్రామానికి చెందిన రామస్వామి రూ. 3,65,000 (మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలు) పాడుకుని దక్కించుకున్నారు. స్వామివారి హుండీని జయమనోజ్ రెడ్డి రూ. 1,16,000 (లక్షా పదహారు వేల రూపాయలు) పాడి సొంతం చేసుకున్నారు.

వేలంపాటల అనంతరం ప్రారంభమైన వినాయకుడి శోభాయాత్ర పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా సాగింది. దారిపొడవునా భక్తుల జయజయధ్వానాలు, మేళతాళాలు, భజనల నడుమ యాత్ర వినాయక ఘాట్‌కు చేరుకుంది. అక్కడ వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, విగ్రహాన్ని ఘనంగా నిమజ్జనం చేశారు. ఈ శోభాయాత్రలో పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి తరలివచ్చి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
