కర్నూలు జిల్లా ఆదోనిలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసిందని కర్నూలు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఏ. సిరి తెలిపారు. స్థానిక ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ (డిస్ట్రిబ్యూషన్) కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలింగ్ సామాగ్రి పంపిణీ ప్రక్రియను, సిబ్బందికి కల్పించిన సౌకర్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి నాణ్యమైన ఆహారం, తాగునీరు తదితర మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తుతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని స్పష్టం చేశారు.

ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఓటర్ స్లిప్పుతో పాటు ఎన్నికల సంఘం నిర్దేశించిన ఏదైనా ఒక గుర్తింపు కార్డును చూపించి ఓటు వేయవచ్చని తెలిపారు. అలాగే, గుర్తింపు పొందిన మీడియా ప్రతినిధులకు పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతి ఉంటుందని పేర్కొన్నారు.

ఆదోని నియోజకవర్గ పరిధిలోని ఆదోని-1, ఆదోని-2 మండలాల్లోని మొత్తం 40 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా, 143 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలిచారు. రెండు మండలాల పరిధిలో మొత్తం 90,902 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

- ఆదోని-1 మండలం: ఈ మండల పరిధిలో 21 గ్రామ పంచాయతీలు ఉండగా, 200 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తం 40,519 మంది ఓటర్లు ఉన్నారు.
- ఆదోని-2 మండలం: ఈ మండల పరిధిలోని 19 గ్రామ పంచాయతీలకు గాను 202 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఇక్కడ మొత్తం 50,383 మంది ఓటర్లు ఉన్నారు.
