అక్రమంగా చిట్టీలు నడుపుతూ.. గడువు ముగిసిన డబ్బులు చెల్లించకుండా మోసం చేస్తూ.. రిటైర్డ్ ఉద్యోగస్తులు, మహిళలే టార్గెట్ గా చేసుకొని సుమారు 50 లక్షల వరకు వసూళ్లు చేసిన ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.
కర్నూలు జిల్లా ఆదోని 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమ తులు లేని చీటీల వ్యాపారం పేరుతో ప్రజలను మోసం చేసిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ రామలింగప్ప తెలిపారు. ఆదోని పట్టణానికి చెందిన సుధారాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ఇలాఉన్నాయి.. ఆదోని పట్టణానికి చెందిన ప్రీతీ సింగ్, ఆమె తండ్రి నారాయణసింగ్, తల్లి పద్మాబాయిలు అనుమతులు లేని ప్రైవేటు చిటీల వ్యాపారం నిర్వహిస్తు ప్రజల వద్ద చిట్టీల పేరుతో సుమారు 20 లక్షలు, ఈ ముగ్గురు ఇతరుల దగ్గర చిట్టీలు వేసి సుమారు 10 లక్షలు, అధిక వడ్డీ ఇస్తామని ఆశ చూపించి సుమారు 25 లక్షలు వసూళ్లు చేసినట్లు ప్రాధమిక దర్యాప్తు లో తేలిందని సిఐ తెలిపారు. చీటి ఎత్తిన వాళ్లు డబ్బులు అడిగితే సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారని. గట్టిగా అడిగితే బాధితురాలు సుధారాణిపై చేయి చేసుకున్నారని అన్నారు. బాధితురాలు సుధారాణితో పాటు మరో 15 మంది బాధితులు స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశారని తెలిపారు. ముగ్గురి పై ఏపీ చిట్ ఫండ్ యాక్టు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు పోలీసులు పేర్కొన్నారు.