కర్నూలు జిల్లాఆదోని పట్టణ శివారులోని నెట్టేకల్ క్రాస్ సమీపంలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదోని మండలం కపటి గ్రామానికి చెందిన 20 మంది వ్యవసాయ కూలీలు సుగ్గి పనుల నిమిత్తం నెల రోజుల క్రితం కర్ణాటకలోని కృష్ణ ప్రాంతానికి పత్తి తీత పనులకు వెళ్లారు. గౌరమ్మ పండుగను స్వగ్రామంలో జరుపుకోవాలనే ఉద్దేశంతో వారంతా కృష్ణ నుండి రైలులో ఆదోని రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. గ్రామానికి వెళ్లేందుకు ముందుగానే తమ ఊరికి చెందిన ఆటోను రప్పించుకుని బయలుదేరారు.

ఆటో పట్టణ శివారు దాటి నెట్టేకల్ క్రాస్ సమీపానికి రాగానే, ఎదురుగా వేగంగా వచ్చిన కారు ఆటోను బలంగా ఢీకొట్టింది. ప్రమాద ధాటికి ఆటో ఒక్కసారిగా రోడ్డుపై బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న మహేశ్వరి (28) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తీవ్ర గాయాలపాలైన కడుబూరయ్య అపస్మారక స్థితిలోకి వెళ్లగా, ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆటో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు పురుషులు, ముగ్గురు చిన్నారులు, నలుగురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయని బాధితురాలు దేవి విలేకరులకు తెలిపారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
