ఆదోని మండలం గోనబావి గ్రామంలో పాత కక్షల నేపథ్యంలో ఓ వ్యక్తిపై ముగ్గురు వ్యక్తులు ఇనుప రాడ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వలి బాషా (40)కు, అదే గ్రామానికి చెందిన కేశవరెడ్డి కుటుంబానికి మధ్య గత కొంతకాలంగా వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ పాత కక్షలను మనసులో ఉంచుకుని కేశవరెడ్డి, ఆయన కుమారులు లక్ష్మీకాంత్ రెడ్డి, నాగిరెడ్డిలు కలిసి వలి బాషాపై ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.

ఈ దాడిలో వలి బాషా తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించిన అనంతరం, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి (జీజీహెచ్) తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. బాధితుడి భార్య ఇంజరి మాభి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేశవరెడ్డితో పాటు ఆయన ఇద్దరు కుమారులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
