కర్నూలు జిల్లా ఆదోని శాసనసభ్యులు డా.పార్థసారథి వాల్మీకి సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర విజన్ 2047 కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ ఆదోని ప్రాంతంలో ఉన్న ఉమెన్ అండ్ చైల్డ్ ఆసుపత్రిలో ప్రతి నెల సుమారుగా 450 ప్రసవాలు జరుగుతున్నాయని, 10 మంది నర్సింగ్ సిబ్బందిని నియమించాలని కోరారు. అదేవిధంగా ఆదోని లో ఆరోగ్య శ్రీ క్రింద కొన్ని ఆస్పత్రులు రోగుల నుండి డబ్బు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. వలసల నివారణకు కస్తూర్బా, జ్యోతిరావు ఫూలే రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేయాలని సూచించారు. వసతి గృహాల్లో ఉన్న విద్యార్థినులకు ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్, శానిటరీ నాప్కిన్స్ అందజేసేలా చూడాలన్నారు. అంతేకాకుండా కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉందని, విద్యా వాలంటీర్లను ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఆదోని టూరిజంకు సంబంధించి కొండల్లో ఉన్న పురాతనమైన కట్టడాల కోసం మరియు రణమండల ఆంజనేయ స్వామి దేవాలయానికి రోడ్డు మార్గం కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అదే విధంగా ఆదోని ఆటో నగర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆదోని మార్కెట్ యార్డు లో మౌలిక వసతులు కల్పించాలని, మార్కెట్ యార్డు లో దళారులు రైతులను వడ్డీ పేరుతో ఇబ్బందులకు గురి చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.