సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి పోరాటయోధుడు కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం వామపక్ష ఉద్యమానికి మరియు దేశానికి తీవ్ర నష్టదాయకమని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, కే. వెంకటేశులు ఆవేదన వ్యక్తం చేశారు.
కర్నూలు జిల్లా ఆదోనిలోని సిఐటియు కార్యాలయంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి లింగన్న అధ్యక్షతన సంతాప సభ నిర్వహించారు. కామ్రేడ్ సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలవేసి, సంతాపం వ్యక్తం చేసి, నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడాతూ 1952లో జన్మించిన కామ్రేడ్ సీతారాం ఏచూరి చిన్న వయసులోనే ఎస్ఎఫ్ఐ ఉద్యమంలో తన పోరుబాటను ప్రారంభించి మరణం వరకు ఎర్రజెండా ఉద్యమాన్ని ముందుకు నడిపించడంలో కీలకపాత్ర పోషించారని కొనియాడారు. ఎస్ఎఫ్ఐ జాతీయ కార్యదర్శిగా, అనతి కాలంలోనే సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు మరియు పోలిట్ బ్యూరో సభ్యులుగా, సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మూడుసార్లు ఎన్నికయ్యారని తెలిపారు. ఆయన మరణం సిపిఎం పార్టీ మరియు వామపక్ష ఉద్యమానికి తీరని లోటని, ఆ లోటును భర్తీ చేయడానికి, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏచూరి రాజకీయ నాయకుడే కాక, రచయితగాను, ఉత్తమ పార్లమెంటు సభ్యుడు గా మంచి గుర్తింపు పొందారన్నారు. 1996 యూనిటెడ్ ఫ్రంట్, 2004 యూపీఏ లాంటి సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు లోనూ ఆయన కీలకపాత్ర పోషించారని అన్నారు. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఇండియా వేదికను నిర్మించడంలో ప్రముఖమైన పాత్ర ఏచూరి దే అని అన్నారు. మతతత్వ బిజెపిని నిలువరించడం కోసం ఇండియా వేదికను బలోపేతం చేయడంలో ఆయన ముందున్నారన్నారు. అలాంటి నాయకుడు, మరణించడం వామపక్ష శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నాయని, ఆయన ఆశయ, సాధన కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు.
ఈ సంతాప సభలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు పి ఈరన్న, పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు తిప్పన్న, ముక్కన్న, మండల కార్యదర్శి వర్గ సభ్యులు బి వీరారెడ్డి, రామాంజనేయులు ఊచ్చిరప్ప, మరియు పట్టణ, మండల కమిటీ సభ్యులు తిక్కప్ప, నాగేంద్ర, బి వెంకటేష్, అజీమ్ ఖాన్, మరియు పార్టీ సభ్యులు, సానుభూతిపరులు, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, సిఐటియు నాయకులు, కార్యకర్తలు నివాళులు అర్పించారు.