ఆదోని మండలంలోని గ్రామాలలో 11 వారాలుగా పెండింగ్లో ఉన్న ఉపాధి హామీ వేతనాలు వెంటనే చెల్లించాలని, మండలంలో అందరికీ పనులు కల్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆదోని ఏపీఓ కి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే లింగన్న మాట్లాడుతూ గత జూన్ నెల నుండి ఇప్పటి వరకు పనులు చేసిన కూలీలకు వేతనాలు అందలేదని, దీంతో ఉపాధి హామీ కూలీలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. కూలీ వేతనాలు అందకపోతే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.
మండల కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు అవుతున్న సరైన వర్షాలు లేక పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామాలలో పనులు కల్పించకుండా, పనులు లేవు అనే పేరుతో నిలిపివేయడం సరికాదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే పెండింగ్లో ఉన్న వేతనాలు అందజేయాలని, ఉపాధి పనులు మండలంలో అందరికీ కల్పించాలని డిమాండ్ చేశారు.
అనంతరం ఏపీవో మాట్లాడుతూ విత్తనాలు కూలీల అకౌంట్లో జమవుతున్నాయని, పనులు అందరికీ కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల నాయకులు హనుమంత్ రెడ్డి, ఉపాధి హామీ మేటీలు అనంత, k హుస్సేనీ, హనుమంత్ రెడ్డి, ఉపాధి కూలీలు గోవింద్ రెడ్డి, y హుస్సేనీ, ఆంజనేయ, నాగయ్య, నర్సిరెడ్డి, చిన్నన్న, బడే సాబ్ తదితరులు పాల్గొన్నారు.