డాక్టర్ ఎమ్మెల్యే ఇలాకాలోనే వైద్యం కరువు

వైద్య వృత్తి నుంచి వచ్చిన వ్యక్తే స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో కనీసం కుక్కకాటుకు వ్యాక్సిన్ కూడా దొరక్కపోవడం ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట” అని ఏపీ రైతు సంఘం తీవ్రస్థాయిలో మండిపడింది. కర్నూలు జిల్లా ఆదోని మండలం 104 బసాపురం గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున 9 మంది కొండాపురం నరసిరెడ్డి, కురువ లింగన్న, బ్యాగారి బజారి, ఉప్పరి పూజ, బోయ గణేష్‌ సహా నలుగురు చిన్నారులు, పలు పశువులపై పిచ్చికుక్క దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను వెంటనే ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించగా, కుక్కకాటుకు వేసే ప్రాణరక్షక ‘యాంటీ రేబిస్ వ్యాక్సిన్’ నిల్వలు లేవంటూ సిబ్బంది చేతులెత్తేయడం అధికారుల బాధ్యతారాహిత్యాన్ని తేటతెల్లం చేసింది.

ఆస్పత్రిలో వైద్యం కోసం వచ్చిన హానికులు

సమాచారం అందుకున్న ఏపీ రైతు సంఘం రాష్ట్ర సమితి సభ్యులు బసాపురం గోపాల్ తక్షణమే ఆసుపత్రికి చేరుకుని సిబ్బందిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా పట్టించుకోరా అంటూ నిలదీయడంతో, అధికారులు దిగొచ్చి ఉదయం 10 గంటల సమయంలో వ్యాక్సిన్లు తెప్పించి బాధితులకు వేయించారు.

పిచ్చికుక్క కాటుకు వైద్యం కోసం వచ్చిన స్థానికులు

ఈ సందర్భంగా బసాపురం గోపాల్ అధికారులను, స్థానిక ఎమ్మెల్యేను ఘాటుగా హెచ్చరించారు: డాక్టర్ ఎమ్మెల్యేకే శ్రద్ధ లేకపోతే ఎలా? : ప్రజాప్రతినిధిగా ఉంటూ పేదల ప్రాణాల కంటే రాజకీయం ముఖ్యం కాదని గుర్తుంచుకోవాలి. స్వయంగా వైద్యుడైన ఎమ్మెల్యే తన ఇలాకాలోని ఆసుపత్రి దుస్థితిని పట్టించుకోకపోవడం సిగ్గుచేటు అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిని వైద్యులు, అధికారులు అలంకారప్రాయంగా మార్చేశారు. ప్రాథమిక చికిత్స అందించాల్సిన చోట అత్యవసర వ్యాక్సిన్లు కూడా లేకపోతే అధికారులు ఏం నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. పేద రోగుల ప్రాణాలతో చెలగాటమాడితే చూస్తూ ఊరుకోబోమని, డాక్టర్ల కొరత తీర్చి అన్ని రకాల మందులు వెంటనే అందుబాటులో ఉంచకపోతే ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆసుపత్రిని ముట్టడిస్తామని హెచ్చరించారు.