కర్నూలు జిల్లా గోనెగండ్ల విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎమ్మిగనూరు ఎక్సైజ్ సీఐ రమేష్ ప్రయాణిస్తున్న కారు.. ఎదురుగా వస్తున్న తుఫాన్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి.

ప్రమాద సమయంలో కారు ఎయిర్‌బ్యాగులు తెరుచుకోవడంతో సీఐ రమేష్ ప్రాణాలతో బయటపడ్డారు. ఎమ్మిగనూరు నుంచి కర్నూలు వైపు సీఐ రమేష్ వెళ్తుండగా, శ్రీశైలం నుంచి సిరుగుప్ప వైపు తుఫాన్ వాహనం వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

మద్యం మత్తులో ఉన్నారా?అయితే ప్రమాదానికి సంబంధించి తుఫాన్ వాహన బాధితులు సంచలన ఆరోపణలు చేశారు. సీఐ రమేష్ మద్యం మత్తులో వాహనం నడిపినట్లు ఆరోపిస్తూ గోనెగండ్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రమాదానికి అసలు కారణం ఏమిటి? సీఐ మద్యం సేవించి వాహనం నడిపారా? లేక ప్రమాదానికి మరేదైనా కారణం ఉందా? అనే అంశాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. బాధితుల ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేపట్టారు.
