నిషేధిత బాణసంచా విక్రయిస్తే కఠిన చర్యలు: ఆదోని ఆర్డీవో

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిషేధిత క్రాకర్స్ విక్రయిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆదోని ఆర్డీవో అరుణ దేవి హెచ్చరించారు. ఆదివారం కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ మైదానంలో ఏర్పాటు చేసిన బాణసంచా దుకాణాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. వ్యాపారుల అనుమతి పత్రాలు, అగ్నిప్రమాద నివారణ ఏర్పాట్లను పరిశీలించారు.

బాణ సంచార షాపులను పరిశీలిస్తున్న ఆర్డీవో

ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ.. కేవలం అనుమతించిన బాణసంచాను మాత్రమే విక్రయించాలని, దుకాణాల వద్ద అగ్నిమాపక భద్రతా పరికరాలు తప్పనిసరిగా ఉంచుకోవాలని స్పష్టం చేశారు. దుకాణాల వద్ద విద్యుత్ జాగ్రత్తలు పాటించాలని, పొగతాగడం వంటి చర్యలకు తావులేకుండా చూడాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని, ప్రజలంతా సురక్షితంగా దీపావళి జరుపుకునేలా వ్యాపారులు సహకరించాలని కోరారు.

బాణసించారా షాప్ లో తనిఖీలు నిర్వహిస్తున్న ఆర్డీవో