కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని తిరుమల నగర్లో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మండపం నుంచి ఒక్కసారిగా భారీగా మంటలు, దట్టమైన పొగలు వ్యాపించడంతో కాలనీవాసులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై పరుగులు తీశారు.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సహకారంతో ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. సకాలంలో స్పందించి మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించకుండా అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. దీంతో కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు.

ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే ఆర్డీవోతో పాటు డీఎస్పీ ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. అనంతరం డీఎస్పీ వెంకటరమణ మాట్లాడుతూ.. వినాయక విగ్రహం చుట్టూ పత్తితో చేసిన డెకరేషన్‌కు లైటింగ్ వేడి తగలడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నట్లు తెలిపారు. నిర్వాహకులు, స్థానికులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేశారు. గణేష్ ఉత్సవాల్లో ఇలాంటి అగ్నిప్రమాదాలు పునరావృతం కాకుండా భద్రతా చర్యలు తీసుకుంటున్నామని, నిబంధనలు పాటించని మండపాల నిర్వాహకులకు నోటీసులు జారీ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

