ఆదోని 31.07.2026 : రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (APWJF) మరియు ఆంధ్రప్రదేశ్ బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (APBJA) ఆదోని డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కి వినతిపత్రం అందజేశారు.

​ఈ సందర్భంగా యూనియన్ ప్రతినిధులు మాట్లాడుతూ… సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమిస్తున్న జర్నలిస్టుల రక్షణ, సంక్షేమం పట్ల ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. మార్చి 4న నిర్వహించిన మహాపదయాత్రలో ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు కొన్ని సమస్యలు పరిష్కారమైనప్పటికీ, ప్రధాన సమస్యలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని గుర్తుచేశారు.

ఆర్డీవో కార్యాలయం ముందు ఆదోని జర్నలిస్టులు

ముఖ్యమైన డిమాండ్లు:  రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులందరికీ 3 సెంట్ల చొప్పున స్థలాలు కేటాయించాలి. విశాఖపట్నం, హిందూపురం వంటి ప్రాంతాల్లో నిలిచిపోయిన స్థలాల అప్పగింత ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలి. గిరిజన ప్రాంత జర్నలిస్టులకు సమీప మైదాన ప్రాంతాల్లో స్థలాలు ఇవ్వాలి. ఇళ్ల నిర్మాణానికి తక్కువ వడ్డీకే రుణాలు, ఆర్థిక సహాయం అందించాలి. జర్నలిస్టుల భద్రత, పని పరిస్థితులు, ఉద్యోగ భద్రతపై అధ్యయనం చేయడానికి రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో సీనియర్ జర్నలిస్టులతో ప్రత్యేక మీడియా కమిషన్ ఏర్పాటు చేసి 6 నెలల్లో నివేదిక తెప్పించాలి.

ఆర్డీవో కార్యాలయం ముందు ఆదోని జర్నలిస్టులు

ఇతర రాష్ట్రాల తరహాలోనే ఆంధ్రప్రదేశ్‌లో కూడా జర్నలిస్టులకు పెన్షన్ పథకాన్ని అమల్లోకి తీసుకురావడానికి అధ్యయన కమిటీని నియమించాలి. దాదాపు 50 ఏళ్లుగా ప్రచురితమై, ఇటీవల నిలిచిపోయిన ప్రభుత్వ ‘ఆంధ్రప్రదేశ్’ మాసపత్రిక ముద్రణను వెంటనే పునరుద్ధరించాలి. నూతనంగా ఏర్పడిన 28 జిల్లాల అవసరాలకు అనుగుణంగా సమాచార పౌరసంబంధాల శాఖను ఆధునీకరించి, తగినంత సిబ్బందిని నియమించాలి.జర్నలిస్టులందరికీ ఏసీ బస్సులతో సహా అన్ని ఆర్టీసీ బస్సుల్లో ఉచిత/రాయితీ ప్రయాణ సౌకర్యాన్ని, అలాగే రైల్వే పాస్‌ల మంజూరు ప్రక్రియను సులభతరం చేయాలి. జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ. 50 కోట్లతో ‘జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్’ ను పునరుద్ధరించాలి. దాడులను అరికట్టేందుకు హోంశాఖ మంత్రి నేతృత్వంలో హైపవర్ కమిటీ, జిల్లా స్థాయిలో పోలీస్ అధికారులతో కమిటీలు ఏర్పాటు చేయాలి. సి. రాఘవాచారి మీడియా అకాడమీకి గవర్నింగ్ కౌన్సిల్ నియమించి వర్కింగ్ జర్నలిస్ట్ సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలి. నిలిచిపోయిన రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్ అవార్డులను ప్రతి ఏటా ప్రదానం చేయాలి. అసంగతిత రంగానికి ఇచ్చే బీమా సదుపాయాన్ని జర్నలిస్టులకు వర్తింపజేయాలి. వయోవృద్ధులైన జర్నలిస్టుల సామాజిక భద్రత కోసం రాష్ట్ర కేంద్రంలో ప్రత్యేక వృద్ధాశ్రమం నిర్మించాలి.

ఈ కార్యక్రమంలో APWJF అధ్యక్షులు, కార్యదర్శులు, ఈసీ సభ్యులు మరియు ఆదోని డివిజన్‌కు చెందిన పలువురు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *