ఆదోని, జూలై 31: తుంగభద్ర డ్యామ్ నుంచి కెనాల్‌కు కొత్త నీరు విడుదల చేసిన నేపథ్యంలో, పట్టణ ప్రజలందరూ తాగునీటి వినియోగంలో కొన్ని రోజుల పాటు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని ఆదోని మున్సిపాలిటీ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. తుంగభద్ర ఎల్ ఎల్ సి కాల్వలో కొత్తగా నీటిని విడుదల చేసిన ప్రారంభ రోజుల్లో నీటితో పాటు మట్టి, చెత్త మరియు ఇతర అవశేషాలు కలిసి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ దృష్ట్యా మున్సిపాలిటీ వాటర్ సప్లై సిబ్బంది నీటి నాణ్యతను నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన క్లోరినేషన్ చర్యలు చేపడుతున్నారని స్పష్టం చేశారు.
ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలు: తాగునీటిని తప్పనిసరిగా మరిగించి, చల్లార్చిన తర్వాత మాత్రమే తాగాలి. నీటిని శుభ్రమైన, మూత ఉన్న పాత్రల్లో మాత్రమే నిల్వ చేసుకోవాలి. తాగునీటి ట్యాంకులు, సంపులు మరియు నిల్వ పాత్రలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చిన్న పిల్లలు, వృద్ధులు మరియు అనారోగ్యంతో ఉన్నవారు ఖచ్చితంగా కాచి చల్లార్చిన నీటినే వినియోగించాలి. సరఫరా అయ్యే నీటిలో రంగు, వాసన లేదా మలినాలు కనిపిస్తే వెంటనే మున్సిపాలిటీ అధికారులకు సమాచారం అందించాలి. నీటి ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించేందుకు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు .ప్రజల ఆరోగ్య రక్షణ దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఈ సూచనలను పాటించి మున్సిపాలిటీకి సహకరించాలని ఆదోని పురపాలక సంఘం కమిషనర్ కోరారు.