కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు కాలనీల్లో ఒకే రోజు వరుస దొంగతనాలకు పాల్పడి స్థానికులను భయాందోళనలకు గురిచేశారు. నగదు, బంగారంతో ఉడాయించారు.
కత్తి ఆంజనేయులు కాలనీ నివాసముంటున్న రాము అనే బ్యాంక్ ఉద్యోగి ఇంట్లో దొంగలు చొరబడ్డారు. హాస్పిటల్ లో తండ్రి ఆపరేషన్ కోసం తెచ్చుకున్న డబ్బులను బీరువా పగులగొట్టి 1,50,000 రూపాయల నగదు, 6 గ్రాముల బంగారం, 30 తులాల వెండి వస్తువులను అపహరించారు. పద్మావతి నగర్ లో రాజు అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు 20 వేల రూపాయల నగదు, 2 గ్రాముల బంగారాన్ని ఎత్తుకెళ్లినట్లు బాధితుడు వాపోయాడు. సాయి నగర్ కాలనీలో కూడా దొంగలు చోరీకి ప్రయత్నించినప్పటికీ, అది విఫలమైనట్లు సమాచారం. వరుస చోరీలతో పట్టణ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దొంగలు చేతివాటం ప్రదర్శించడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. వరుస చోరీలపై సమాచారం అందుకున్న త్రీ టౌన్ పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.