కర్నూలు జిల్లా ఆదోని మండలం నాగలాపురం గ్రామంలో వేరుశనగ, కొర్ర, పత్తి పంటలలో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యల గురించి కర్నూలు ఎ డి ఎ, డిఆర్సి డాక్టర్ కే. వెంకటేశ్వర్లు, ఆదోని ఎ డి ఎ డాక్టర్ అరుణకుమారి మరియు మండల వ్యవసాయ అధికారి అశోక్ కుమార్ రెడ్డి
రైతులకు వివరించారు.
అనంతరం పంట పొలాలను సందర్శించి వేరుశనగ పంట 30 నుండి 45 రోజుల కాలవ్యవధి కలిగి పొగాకు లద్దె పురుగు ఉన్నట్లుగా అధికారులు గమనించి తీసుకోవలసిన జాగ్రత్తలను రైతులకు తెలిపారు. ఎకరానికి రెండు కిలోల బెల్లం 5 కిలోల తవుడు మరియు క్లోరోపైరీఫాస్ కలుపుకొని సాయంత్రం వేళల్లో ఉంటలుగా చేసి పొలమందు వెదజల్లడం వల్ల ఈ పురుగు ఉధృతి తగ్గుతుంది అని తెలిపారు. అయితే వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని బెట్టకు వచ్చిన పంటలకు 2% యూరియా ద్రావణాన్ని పిచికారి చేయవలసిందిగా రైతులకు సూచించారు.
కొర్ర పంటలో కాండం తొలుచు పురుగు ఉన్నట్లు అధికారులు గమనించి దీనికి( కెల్డాన్) కార్ టాప్ హైడ్రోక్లోరైడ్ అనే మందును ఎకరానికి పావు కిలో పిచికారి చేయాలని రైతులకు తెలిపారు.
పత్తి పంటలో దోమ ఉధృతిని తగ్గించడానికి పసుపు రంగు నూనె పూసిన అట్టలను ఎకరానికి 10 చొప్పున మొక్క కంటే కొద్దిగా ఎత్తులో ఉంచడం వల్ల తెల్ల మరియు పచ్చ దోమ యొక్క ఉధృతిని తగ్గించవచ్చని రైతులకు తెలిపారు.