హొలీ పండుగ వచ్చిందంటే పిల్లలు నుండి పెద్దల వరకు రంగులు చల్లుకుని సంబరాలు జరుపుకోవడం తెలుసు కానీ ఈ గ్రామంలో మాత్రం హొలీ పండుగకు పురుషులు మహిళ వేషధారణతో రతి మన్మధులకు పూజలు చేసి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తున్నది.
కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకుళ్ళురు గ్రామం లో రెండు రోజులు పండుగ వాతవరణం కనిపిస్తుంది. హొలీ పండుగ రోజు పురుషులు కోకా రైకా కట్టుకోకపోతే అరిష్టం జరుగుతుందనేది వీరి నమ్మకం అందుకే మగాళ్లంతా లుంగీలు తీసేసి కట్టు బొట్టు లంగావోణి, చీరలతో సింగారించుకుని రథి మన్మథులకు పూజలు చేయడం ఔరా అనిపిస్తుంది. మగువలుగా ముస్తాబైన మగవారు పిండివంటలు నైవేద్యంగా తీసుకొని కుటుంబ సభ్యులతో కలిసి తప్పెట్లు , తాళాలతో వీధుల్లో ఆట పాటలతో అందరిని అలరిస్తూ దేవాలయం చేరుకొని రతి మన్మధులకు ప్రత్యేక పూజలు చేస్తారు. చదువుకున్న వారు కూడా తమ కోరికలు తీరడానికి కోకా రైకా కట్టి రథి మన్మధులకు మొక్కుబడి చెల్లిస్తారు. తమ గ్రామం సుభిక్షంగా ఉండాలంటే వ్యవసాయం, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో తమ కోరికలు నెరవేరాలంటే మగవారు మగువ వేషం వేయాల్సిందే. లేదంటే ఏదైనా కీడు జరుగుతుందనేది గ్రామస్తుల నమ్మకం. ఈ వింత ఆచారాన్ని తిలకించడానికి పొరుగు రాష్ట్రలైన కర్ణాటక , మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల భక్తులు వస్తారు.