మండలంలో ఉపాధి హామీ పనులు కల్పించి వలసలు నివారించాలని, ఉపాధి హామీ పాండవుగల్ ఫీల్డ్ అసిస్టెంట్ గా వీరమ్మను కొనసాగించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా..
కర్నూలు జిల్లా ఆదోని ఎంపీడీవో కార్యాలయం ముందు సిపిఎం పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎంపీడీవో రాజేంద్రప్రసాద్ ఇన్చార్జి ఎ పీవో కాలిక్ భాషలకు అందజేశారు. ఆదోని మండలంలో వ్యవసాయ కూలీలు వేల సంఖ్యలో వలసలకు వెళ్తున్నారని వలసల నివారణ కోసం ఉపాధి హామీ పనులు కల్పించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్మా చేపట్టారు.
ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే వెంకటేశులు మాట్లాడుతూ వేలాదిమంది వలసలు వెళుతుంటే కూటమి ప్రభుత్వం, అధికారులు నిద్రమత్తులో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వలసల నివారణ కోసం ఉపాధి హామీ పనులు కల్పించకుండా ఉపాధి హామీలో రాజకీయo చేస్తున్నారని విమర్శించారు. గత 18 సంవత్సరాలుగా 100కు 100% పనులు కల్పిస్తూ వందరోజుల పని అత్యధిక మందికి కల్పించిన పేరు ఉన్న పాండవగల్ గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ను తొలగించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. నిజాయితీగా పనులు జరుగుతున్న గ్రామాలపై మీ రాజకీయ పెత్తనం తగదని హెచ్చరించారు. ఇప్పటికైనా మండలాధికారులు జోక్యం చేసుకొని మండలంలోని అన్ని గ్రామాల్లో ఉపాధి పనులు కల్పించాలని పాండవగల్ గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్గా వీరమ్మనే కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కే. లింగన్న, మండల కార్యదర్శి వర్గ సభ్యులు ఉచ్చిరప్ప, రామాంజనేయులు, మండల నాయకులు శేఖర్ రామాంజనేయులు, భాష, తిక్కప్ప, లక్ష్మన్న, హనుమంత్ రెడ్డి, ఆయా గ్రామాల శాఖ కార్యదర్శిలు గోవిందు, కే వెంకటేష్, దస్తగిరి భాషా, బసరకోడు రామాంజనేయులు, మునిస్వామి, జి పరమేష్, కర్ణ అయ్యన్న పార్టీ సభ్యులు సానుభూతిపరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.