కర్నూలు జిల్లా ఆదోనిలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ (పిడిఎస్ఓ) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నీట్ – 2024 పరీక్ష నిర్వహణలో జరిగిన స్కాంలపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని, నీట్ రాసిన విద్యార్థులకు న్యాయం చేయుటకు సత్వర చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ (పిడిఎస్ఓ) ఆధ్వర్యంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పిడిఎస్ఓ రాష్ట్ర నాయకులు తిరుమలేష్ మాట్లాడుతూ పరీక్షకు ఒకరోజు ముందే ప్రశ్నా పత్రం సోషల్ మీడియాలో ఎలా లీక్ అయింది? ప్రకటించిన తేదీ ( జూన్ 14) కంటే పది రోజులు ముందు (దేశ ఎన్నికల ఫలితాల రోజు) జూన్ 4వ తేదీన నీట్ ఫలితాలను ఎందుకు విడుదల చేశారు అని ప్రశ్నించారు. రష్యా -ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాను అని చెప్తున్న మోడీ, నీట్ లో జరుగుతున్న పేపర్ లీకేజీలను మాత్రం ఎందుకు ఆపలేకపోతున్నాడు? పేపర్ లీకేజీ స్కాంలలో ఇంకెంత మంది విద్యార్థులు బలైపోవాలి? దేశవ్యాప్తంగా నీట్ పరీక్షలో జరిగిన స్కాం లను వ్యతిరేకిస్తూ నిరసనలు చేపడుతుండగా, మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉండటాన్ని ఖండించారు. కార్పొరేటీకరణను ప్రోత్సహిస్తున్న నీట్, సియుఇటి తరహా పరీక్షలను రద్దు చేయాలి.వైద్య విద్య ప్రవేశ పరీక్ష నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలి.దేశవ్యాప్తంగా విద్యార్థుల సంఖ్యకనుగుణంగా ప్రభుత్వ వైద్య కళాశాలలను వెంటనే ఏర్పాటు చేయాలి, తిరిగి మరలా నీట్ పరీక్షను నిర్వహించాలి అని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పిడిఎస్ఓ డివిజన్ సెక్రెటరీ శివ,గిద్దయ్య మహిళా కన్వీనర్స్ నికిత శ్రావణి ఎన్ వై ఎస్ నాయకులు వీరేష్, ప్రవీణ్ రంగస్వామి కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.