భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కర్నూలు జిల్లా పత్తికొండలో దళిత సంఘాల నేతలతో పాటు, పలు స్వచ్ఛంద సంఘ ప్రతినిధులు ఘన నివాళి అర్పించారు. దళిత సమాఖ్య నాయకులు శీను, మోజెస్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహం నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు డప్పు వాయిద్యాలతో ర్యాలీ నిర్వహించారు. అలాగే సిపిఐ అనుబంధ సంస్థ దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ నుండి అంబేద్కర్ కూడలి వరకు ప్రదర్శన నిర్వహించారు. దళిత సంఘాల ప్రతినిధులతో పాటు సిపిఐ నేత రామచంద్రయ్య డప్పు వాయించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఏపీయూడబ్ల్యూజే నాయకులు సాలు రంగడు, రంగన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వైఎస్ఆర్సిపి పార్టీ నేతలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మహానేత అంబేద్కర్ ఆశయ సాధన కోసం దేశంలోని ప్రతి ఒక్కరూ పాటుపడాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పలువురు నేతలు పిలుపునిచ్చారు. దళిత సమాఖ్య ప్రతినిధులు శీను, మోజస్ తదితరుల ఆధ్వర్యంలో పాత బస్టాండ్ సర్కిల్లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాలలతో అత్యంత సుందరంగా అలంకరించి పలువురి ప్రశంసలు అందుకున్నారు.