రాత్రికి రాత్రే పంట కోసి ఎత్తుకెళ్లిన దుండగులు

కష్టపడి సాగు చేసిన పంట చేతికొచ్చిన వేళ, అన్నదాతకు తీరని అన్యాయం జరిగింది. కంటికి రెప్పలా కాపాడుకున్న మిరప పంటను రాత్రికి రాత్రే గుర్తుతెలియని దుండగులు కోసి ఎత్తుకెళ్లిన ఘటన కర్నూలు జిల్లా ఆదోని మండలం ధనపురం గ్రామంలో తీవ్ర కలకలం రేపింది.

కుటుంబ సభ్యులతో పంటను పరిశీలిస్తున్న భాష
వీడియో చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

బాధిత రైతు తెలిపిన వివరాల మేరకు.. ధనపురం గ్రామానికి చెందిన బాషా అనే రైతు తనకున్న రెండున్నర ఎకరాల పొలంలో భారీగా పెట్టుబడి పెట్టి బ్యాడిగి రకం మిరప పంటను సాగు చేశారు. పంట దిగుబడి ఆశాజనకంగా ఉండటంతో పాటు ప్రస్తుతం కోత దశకు చేరుకుంది. మరో రెండు రోజుల్లో పంట కోసి మార్కెట్‌కు తరలించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.

పంట నష్టంతో లబోది ఇవ్వమంటున్న యజమాని

ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం తెల్లవారుజాము సమయంలో పొలంలోకి చొరబడి, కోతకు సిద్ధంగా ఉన్న మిరపకాయలను గుట్టుచప్పుడు కాకుండా కోసి తరలించుకుపోయారు. ఉదయం పొలానికి వెళ్లి చూసిన రైతు బాషా, మిరప తోట మొత్తం ఖాళీగా ఉండటాన్ని చూసి షాక్‌కు గురై లబోదిబోమన్నారు.

పండు నష్టాన్ని పరిశీలిస్తున్న భాష

రాత్రింబవళ్లు కష్టపడి పెంచిన పంట చేతికందే సమయంలో దుండగులు దోచుకెళ్లడంతో దాదాపు రూ.8 లక్షల మేర తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందని బాధితుడు కన్నీటిపర్యంతమయ్యాడు. అప్పులు తెచ్చి సాగు చేశానని, ఇప్పుడు తాము రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై బాధిత రైతు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పంట చోరీకి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించి, తమకు న్యాయం చేయాలని బాధిత రైతు పోలీసులను, ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

భాష మెరుపు పంట పొలం ఫోటో