రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయిప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా ఆదోని ద్వారక ఫంక్షన్ హాల్‌లో మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదోని నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశం ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ… ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అక్రమ వ్యాపారాలు సాగుతున్నాయని, దోపిడీ రాజ్యం నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా వ్యతిరేక విధానాలను క్షేత్రస్థాయిలోకి బలంగా తీసుకెళ్లి ప్రజలను చైతన్యవంతం చేయాలని ఆయన కేడర్‌కు సూచించారు.

ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ… పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వైఎస్సార్‌సీపీ ఐడీ కార్డులు తీసుకోవాలని, వీటి ద్వారా పార్టీలో పనిచేసే వారికి భవిష్యత్తులో సముచిత స్థానం, గుర్తింపు దక్కుతాయని స్పష్టం చేశారు.

ఈ విస్తృత స్థాయి సమావేశానికి నియోజకవర్గ పరిధిలోని మండలాల కన్వీనర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు కౌన్సిలర్లు, అనుబంధ సంఘాల నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు.
