◆ నాటుసారా తయారీ కేంద్రంపై మెరుపు దాడి ◆ 350 లీటర్ల బెల్లం ఊట, తయారీ సామాగ్రి ధ్వంసం ◆ 75 లీటర్ల నాటుసారా, బైక్ స్వాధీనం.. ఇద్దరిపై కేసు నమోదు..

కర్నూలు జిల్లా ఆదోని సుల్తానాపురం కొండల ప్రాంతంలో రహస్యంగా సాగుతున్న నాటుసారా తయారీ స్థావరంపై ఆదోని రూరల్ పోలీసులు డ్రోన్ కెమెరా సహాయంతో ఆకస్మిక దాడి నిర్వహించారు. కర్నూలు జిల్లా ఎస్పీ, ఆదోని డీఎస్పీ ఆదేశాల మేరకు ఆదోని రూరల్ సీఐ సి. నల్లప్ప పర్యవేక్షణలో ఎస్బీ ఎస్సై డి. మహేష్ కుమార్, తమ సిబ్బందితో కలిసి కొండ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు.

కొండల మధ్య రహస్య ప్రాంతాలను గుర్తించేందుకు డ్రోన్ కెమెరాలను ఉపయోగించగా, ఆదోని టౌన్ వాల్మీకి నగర్‌కు చెందిన వ్యక్తులు అక్కడ గుట్టుచప్పుడు కాకుండా సారాయి బట్టీ ఏర్పాటు చేసి నాటుసారా తయారు చేస్తున్నట్లు బయటపడింది. వెంటనే సిబ్బందితో అక్కడికి చేరుకున్న పోలీసులు దాడి చేసి, సారా తయారీకి సిద్ధం చేసిన సుమారు 350 లీటర్ల బెల్లం ఊటను, ఇతర పరికరాలను అక్కడికక్కడే ధ్వంసం చేశారు.

ఈ తనిఖీల్లో తయారైన 75 లీటర్ల నాటుసారాతో పాటు రవాణాకు ఉపయోగిస్తున్న ఒక మోటార్ సైకిల్‌ను పోలీసులు సీజ్ చేశారు. పోలీసుల రాకను గమనించి నిందితులు ఇద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. వారిపై కేసు నమోదు చేసినట్లు రూరల్ సీఐ తెలిపారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే పట్టుకుని రిమాండ్‌కు తరలిస్తామని, అక్రమ సారా తయారీ, విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు.