ఏపీలో మొత్తం ఓటర్లు 4.16 కోట్లు: సీఈఓ వివేక్ యాదవ్
ఆంధ్రప్రదేశ్లో మొత్తంఓటర్ల సంఖ్య 4,16,27,694గా నమోదైందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (CEO) వివేక్ యాదవ్ వెల్లడించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ(సర్) ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఓటర్ల వివరాలను ఆయన అధికారికంగా ప్రకటించారు. అత్యధికంగా 44,89,488 మంది ఓటర్లకు సరైన అడ్రస్ లేదని సీఈఓ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 15,22,174 మంది ఓటర్లు మరణించినట్లు వెల్లడించారు. అలాగే, 14,43,886 మంది ఓటర్లు మరో చోటుకు బదిలీ అయ్యారని, ఇతర ప్రాంతాల్లో కొత్తగా నమోదైన ఓటర్ల సంఖ్య 7,37,216 గా ఉందన్నారు.
ఆచూకీ లభించని ఓటర్ల సంఖ్య 7,77,885 గా తేలిందని సీఈఓ తెలిపారు. అలాగే ఇతర కేటగిరీల కింద మరో 8,327 మంది ఓటర్లు ఉన్నారని వివేక్ యాదవ్ వివరించారు. అర్హులైన వారు మళ్లీ ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం మరో అవకాశాన్ని కల్పిస్తోందన్నారు. ఈ నెల 31 నుంచి ఆగస్టు 30 వరకు సరైన డాక్యుమెంట్లను చూపించి, మరలా ఓటర్గా నమోదు చేసుకునేందుకు అవకాశం ఇస్తున్నట్లు సీఈఓ వివేక్ యాదవ్ ప్రకటించారు.
