2023 సంవత్సరంలో ఖరీఫ్ మరియు రబి రెండు సీజన్లలో పంట నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలని, అలాగే కంపెనీల ద్వారా రావలసిన ఇన్సూరెన్స్ చెల్లించాలని కోరుతూ రైతు వ్యవసాయ మరియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఆదోని మండలం గనేకల్, హనవళు గ్రామ సచివాలయల ముందు ఆందోళన చేసి సచివాలయ సిబ్బందికి డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్బంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు లింగన్న మాట్లాడుతూ..
ప్రభుత్వం కొంతమందికి మాత్రమే పంట నష్టపరిహారం ఇచ్చిందని మరికొంతమందికి నష్టపరిహారం ఇవ్వలేదని తక్షణమే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే కరువు వల్ల నష్టపోయిన రైతులకు కంపెనీల నుంచి రావలసిన ఇన్సూరెన్స్ ఏ ఒక్క రైతుకు ఇవ్వలేదని తక్షణమే ఇన్సూరెన్స్ చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడుతూ..
రైతుల మోటార్లకు మీటర్లు బిగించే విధానానికి ప్రభుత్వం స్వస్తి పలకాలని తెలిపారు. మండలంలో ఉపాధి హామీ వేతనాలు 10 వారాలకు పైగా పెండింగ్లో ఉన్నాయని వాటిని తక్షణమే చెల్లించాలని మరియు 200 రోజులు పని దినాలతో పాటు 600 రూపాయలు వేతనం వ్యవసాయ కూలీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు కౌలు రైతు కార్డులు ఎలాంటి కండిషన్ లేకుండా ఇవ్వాలని బ్యాంకుల ద్వారా రుణాలు మరియు సబ్సిడీ విత్తనాలు ఎరువులు అందించాలని కోరారు.
ఈ ఆందోళన కార్యక్రమంలో రైతు సంఘం మండల నాయకులు భాష, హనుమంత్ రెడ్డి వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు గోవిందు, అబ్దుల్ రహీం, సిఐటియు మండల అధ్యక్షులు రామాంజనేయులు, రైతు వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు కృష్ణ గోవిందరెడ్డి రమేష, కొండయ్య, వై.తాయన్న, s. తాయన్న, మరియు పాండవుగల్, గనేకల్,హనవాళ్ గ్రామాల రైతులు, కూలీలు పాల్గొన్నారు.