కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని హనుమాన్ నగర్ ఎరుకుల కాలనీలో ఏకలవ్య జయంతి వేడుకలు యువత ఆధ్వర్యంలో ఆదివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఏకలవ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏకలవ్య జీవిత విశేషాలు, త్యాగం, ధనుర్విద్యలో సాధించిన అపూర్వ ప్రతిభను స్మరించుకున్నారు.
ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మాజీ బ్యాంకు ఉద్యోగి ఎరుకుల మరెన్న, మాజీ కౌన్సిలర్ లక్ష్మప్ప, ఎరుకుల నాగేష్, ఎరుకుల ఈరన్న, ఎరుకుల ఉరుకుందప్ప, ఎంఈవో రామ్‌మూర్తి, ఈఈఓ వెంకటేష్, ఆదివాసి జిల్లా కాంగ్రెస్ చైర్మన్ ఎరుకుల మారుతి రావు, ఎస్సీ–ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యుడు రవికుమార్, కానిస్టేబుల్ ప్రకాష్, బల్లేకల్ ఈరన్న, అయ్యప్ప తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. ఏకలవ్యుని జీవిత చరిత్ర ప్రతి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కష్టపడి సాధించాలనే తపన, గురుభక్తి, ఆత్మగౌరవానికి ఏకలవ్యుడు నిలువెత్తు ప్రతీకగా నిలిచారని కొనియాడారు. నేటి సమాజంలోని యువత ఏకలవ్యుని ఆశయాలను ఆదర్శంగా తీసుకుని విద్య, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, సమాజ అభివృద్ధికి ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. వేడుకలు నిర్వహించడంలో యువత చూపిన కృషిని పలువురు అభినందించారు.
ఈ కార్యక్రమంలో హనుమాన్ నగర్ కాలనీకి చెందిన యువకులు, మహిళలు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.